Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆమె రంగంలోకి దిగింది. సోషల్ మీడియాలో పప్పులా ఎగతాళి పాలవుతున్న రాహుల్ పోరాట వీరుడు అయ్యాడు. ఇక గుజరాత్ షేర్ అని ప్రశంసలు దక్కించుకున్న మోడీ అధికారం కోసం ఇంతగా దిగజారతాడా అని ఆయన అభిమానులైన నెటిజన్లే ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ఈ మార్పుకి ఆమె ఒక్కరే కారణం కాకపోవచ్చు. కానీ ఆమె కూడా ఓ కారణం. ప్రధాన కారణం. కాంగ్రెస్ డిజిటల్ ప్రచార విభాగం బాధ్యతలు తీసుకున్న నెలల్లోనే ఆమె సాధించిన విజయం ఇది. ఆమె రాహుల్ టీం లో కీలకంగా ఎదుగుతున్న కర్ణాటక మాజీ ఎంపీ, నటి రమ్య. అభిమన్యు సినిమాలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కి జోడీగా నటించిన రమ్య ఇంకొన్ని సినిమాల్లో కనిపించి తెలుగు వారికి పరిచయం అయ్యారు. సోషల్ మీడియాలో ఆమె సాధించిన ఘనత చూసి పొంగిపోయిన రాహుల్ త్వరలో ఆమెకు మరిన్ని బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నారట. ఓ నటిగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆమెకి వున్న గుర్తింపు ని పార్టీ కోసం ఉపయోగించుకునేలా రమ్య కి సౌత్ లో ప్రచార బాధ్యతలు అప్పగించాలి అనుకుంటున్నారట.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాక తెలుగు రాష్ట్రాల్లో రమ్య సేవలు వాడుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. మరీ ముఖ్యంగా విభజన దెబ్బతో కాంగ్రెస్ కుదేలైన ఏపీ లో పార్టీని గాడి లో పెట్టేందుకు రమ్య సేవలు ఉపయోగపడతాయని కాంగ్రెస్ అనుకుంటోంది. విభజన వల్ల కాంగ్రెస్ అంటే ఆంధ్ర ప్రజలు మండిపోతే, ఆ సమయంలో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిన బీజేపీ అంటే కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇదే పాయింట్ ని ఆధారం చేసుకుని బీజేపీ ఆంధ్రకు చేసిన ద్రోహాన్ని సమర్ధంగా జనంలోకి తీసుకెళ్లగలిగితే ఆదినుంచి కాంగ్రెస్ కంచుకోట అయిన ఏపీ లో పరిస్థితి మారుతుందని ఆ పార్టీ హైకమాండ్ ఆలోచన. ఈ పని రమ్య అయితే సమర్ధంగా నిర్వహించగలరని రాహుల్ నమ్మకం.