Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ ఎన్నికల ప్రచారం మొత్తం మతవిశ్వాసాల చుట్టూనే తిరుగుతోంది. రాష్ట్రంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ తరచుగా అక్కడి ఆలయాలను సందర్శిస్తున్నారు. దీంతో రాహుల్ మతవిశ్వాసాలపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. రాహుల్ గాంధీ అసలు హిందువే కాదని, తల్లి సోనియాలా ఆయన కూడా క్రిస్టియానిటీని నమ్ముతారని బీజేపీ విమర్శిస్తోంది. హిందూ మతంపై నమ్మకం లేని రాహుల్ గుజరాత్ ఎన్నికల్లో ఓట్ల కోసమే ఆలయాలను సందర్శిస్తున్నారని ఆరోపిస్తోంది. సోమనాథ్ ఆలయంలో దర్శనానికి వెళ్లిన రాహుల్ నాన్ హిందూ రిజిస్టర్ లో సంతకం చేయడం ఈ విమర్శలకు మరింత ఊతమిచ్చింది. అయితే తాను అందులో సంతకం చేయలేదని, బీజేపీ నేతలే తన పేరును అందులో రాశారని రాహుల్ ఎదురుదాడికి దిగారు. తనతో పాటు తమ కుటుంబం మొత్తం శివభక్తులమే అని కూడా చెప్పుకొచ్చారు.
రాహుల్ కు మద్దతుగా కాంగ్రెస్ ఇతర నేతలు కూడా బీజేపీ నాయకుల మతాచారాలపై విమర్శలకు దిగుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అసలు హిందువే కాదని కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను హిందువునని అమిత్ షా చెప్పుకుంటుంటారని… కానీ ఆయనసలు హిందువే కాదని రాజ్ బబ్బర్ ఆరోపించారు. అమిత్ షా నిజానికి జైన మతస్తుడని, ముంబైలోని జైన కుటుంబంలో ఆయన పుట్టారని, తర్వాత గుజరాత్ కు వచ్చి సెటిలయ్యారని రాజ్ బబ్బర్ తెలిపారు. అటు గుజరాత్ ప్రచారం సాగుతున్న తీరును రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. నిరుద్యోగం, పేదరికంతో పాటు స్థానిక సమస్యలు ఎన్నో ఉండగా… ప్రధాన రాజకీయ పార్టీలు వాటి గురించి మాట్లాడకుండా… మత విశ్వాసాలపై విమర్శలు చేసుకోవడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.