కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఆయన ఒకప్పుడు కీలకనేత. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ్యుడిగా కూడా పనిచేసిన ఆయన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో ఆ పార్టీలో చేరారు. చిరంజీవి అభిమానించే, సలహాలు స్వీకరించే ముఖ్యనేతల్లో ఒకరిగా ఎదిగారు. ఆయన ఎవరో కాదు మాజీ మంత్రి సీ రామచంద్రయ్య. అయితే ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రాకపోవడం, ఆ పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయడంతో, తనను నమ్ముకున్న రామచంద్రయ్యకి చిరంజీవి ఎమ్మెల్సీ పదవి దక్కేలా చేయగలిగారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడే ఆయన కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. అంటే దాదాపు ఎనిమిదేళ్ల అనుబంధం ఆయనకు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందన్నది బహిరంగ రహస్యం. అయితే రామచంద్రయ్య పార్టీని వీడతారని ఊహాగానాలు గతకొంతకాలం నుంచి విన్పిస్తున్నప్పటికీ చిరంజీవి పార్టీలోనే ఉండటంతో ఆయన కూడా తప్పక ఉంటూ వస్తున్నారు.
చిరంజీవి తనకు ఇచ్చిన ప్రయారిటీతో ఆయను వీడి వెళ్లలేక రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. అయితే కొంతకాలంగా ఆయన వీలు దొరికినప్పుడల్లా అధికార తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడుతున్నారు. అమరావతి నిర్మాణం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకూ అన్నింటా అవినీతి జరుగుతుందని సీ.ఆర్.తరచూ టీడీపీ పై ఫైర్ అవుతూనే వస్తున్నారు. అయితే తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా చంద్రబాబు కాంగ్రెస్ కూటమిలో చేరడం ఆయనకు మింగుడు పడడం లేదు. తాను నమ్మిన చిరంజీవి అదే పార్టీలో ఉన్నా ఆయన సినిమాల్లో బిజీగా మారిపోయారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారో లేదో తెలియదు. మరోవైపు తాను కాదని వచ్చేసిన పార్టీతో కాంగ్రెస్ కలిసి నడవడాన్ని రామచంద్రయ్య జీర్ణించుకోలేక పోతున్నారు.
తెలుగుదేశం పార్టీతో కలిస్తే కాంగ్రెస్ ఇక ఏపీలో కోలుకోలేదన్నది రామచంద్రయ్య అంచనా. ఒక వేళ అదే జరిగితే తన పరిస్థితి ఏమితో అని భయపడి బెంగ పడిన ఆయన ఒకసారి మాట మాత్రంగా చిరంజేవికి తెలియచెప్పి పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రామచంద్రయ్య జనసేనలో చేరతారనితెలుస్తోంది. గతంలోనే జనసేన నేత మాదాసు గంగాధరం సి.రామచంద్రయ్యతో చర్చలు జరిపారు. దీంతో ఆయన జనసేన రైలు ఎక్కడం ఖాయంగానే కనిపిస్తోంది.