Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధానమంత్రి మోడీపై మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరును అందరూ మెచ్చుకుంటున్నారు. త్వరలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న రాహుల్ చాలా హుందాగా ప్రవర్తించారని రాజకీయ విశ్లేషకులు సైతం కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ కు సంబంధించిన ఓ పోస్టర్ ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. అలహాబాద్ కాంగ్రెస్ నేత హసీబ్ అహ్మద్ డిజైన్ చేయించిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో రాహుల్ బ్యాట్స్ మెన్ వేషధారణలో ఉన్నారు. మైదానంలో ఆయన బ్యాట్ పట్టుకుని బాల్ ని కొడుతున్నారు. బాల్ రూపంలో ఉంది మణిశంకర్ అయ్యర్. ఆ బాల్ ను రాహుల్ గట్టిగా కొట్టినట్టుగా… వెల్ డన్ రాహుల్ భయ్యా అని పోస్టర్ లో రాసిఉంది.
ప్రధానమంత్రిని నీచ్ జాతికి చెందిన వ్యక్తని మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యానించడం తీవ్ర కలకలం రేపింది. గుజరాత్ ఎన్నికల వేళ అయ్యర్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ ఓటుబ్యాంక్ పై ప్రభావం చూపిస్తాయని అంతా అనుకున్నారు. అయ్యర్ వ్యాఖ్యలను ప్రధాని మోడీ తన ఎన్నికల ప్రచార సభలో ప్రస్తావించారు కూడా. దీంతో వెంటనే రంగంలోకి దిగిన కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. అయ్యర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు రాహుల్ ట్విట్టర్ లో ప్రకటించారు. కాసేపటికే ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసింది. అటు గుజరాత్ రెండో విడత ఎన్నికల ప్రచారంలో కూడా రాహుల్ అయ్యర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రధాని మోడీని గౌరవిస్తుందని, ఆయన గురించి మాట్లాడిన అయ్యర్ పై కఠిన చర్యలు తీసుకుందని రాహుల్ చెప్పారు.