Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా ఎత్తులకు పై ఎత్తులు వేసి అహ్మద్ పటేల్ ను గెలిపించుకున్న కాంగ్రెస్ ఇక ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టింది. ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాజ్యసభ ఎన్నికలో వ్యయప్రయాసల కోర్చి గట్టెక్కిన వెంటనే అహ్మద్ పటేల్ చెప్పిన మాట ఇదే. తన తదుపరి లక్ష్యం గుజరాత్ ఎన్నికలే అని ఆయన స్పష్టంచేశారు. అయితే ఆయన మాటలను ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం అదే లక్ష్యంతో ముందుకు పోతోంది. తాజాగా గుజరాత్ లో ఆ పార్టీ తలపెట్టిన మహా నిరసనే ఇందుకు నిదర్శనం. గిరిజనులపై దాడులకు నిరసనగా సెప్టెంబరు ఒకటిన సత్యాగ్రహ ర్యాలీ చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందుకోసం ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించిది.
కాంగ్రెస్ తో భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఈ ర్యాలీలో పాల్గొనాలని ఆ పార్టీ కోరింది. మహా నిరసనలో పాల్గొనాల్సిందిగా అన్ని ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించామని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ర్యాలీకి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వం వహించనున్నట్టు సమాచారం. ఈ ర్యాలీ ద్వారా సత్తా చాటి ప్రజల్లోకి వెళ్లాలని అధిష్టానం ఆలోచన. కాంగ్రెస్ గుజరాత్ లో అధికారం కోల్పోయి రెండు దశాబ్దాలు కావొస్తోంది. మోడీ ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టింది మొదలు కాంగ్రెస్ అంతకంతకూ బలహీనపడుతూ వచ్చింది.
ప్రభుత్వ వ్యతిరేకతను సైతం తట్టుకుని మోడీ వరుసగా మూడుసార్లు గుజరాత్ లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. గోద్రా అల్లర్లు వంటి దుర్ఘటనలు సైతం బీజేపీ అధికార పీఠాన్ని కదిలించలేకపోయాయి. గుజరాత్ విజయాల ద్వారానే అద్వానీ వంటి సీనియర్లను సైతం పక్కనపెట్టి బీజేపీలో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిత్వం దక్కించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తరువాతే మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా రాష్ట్రం నలుమూలలా బీజేపీ చొచ్చుకుపోయింది. మరి అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పునరుజ్జీవం సాధిస్తుందా…ఒక్క రాజ్యసభ స్థానంలో గట్టెక్కట్టం కోసం కోట్లు ఖర్చుపెట్టి జాతీయస్థాయిలో అభాసు పాలయిన పార్టీ గుజరాత్ లో అధికారం కోసం కంటున్న కలలు సాకారం అవుతాయా…?
కాంగ్రెస్ వ్యూహాలు షా, మోడీ ముందు ఫలితాన్నిస్తాయా…? అంటే కాదనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అహ్మద్ పటేల్ గెలుపు చూసుకుని కాంగ్రెస్ తన స్థాయికి మించి ఆలోచనలు చేస్తోందని, మోడీ రాష్ట్రాన్ని వీడిన తరువాత గుజరాత్ లో బీజేపీ కాస్త బలహీన పడిన మాట నిజమే అయినా…కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని వారు అంటున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం గుజరాత్ టార్గెట్ గా పెట్టుకుని పునర్ వైభవం సాధించాలని భావిస్తోంది.
మరిన్ని వార్తలు: