ఈ దేశంలో సుదీర్ఘ కాలం అధికారంలో వున్న పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీ విధానాలకు వ్యతిరేకంగానే ఎన్నో పార్టీలు పుట్టాయి. కాంగ్రెస్ తో పోరాడాయి. అయితే బీజేపీ బలపడేకొద్దీ ఆ పార్టీలు అవసరార్ధమో, విధాన నిర్ణయమో గానీ కాంగ్రెస్ తో పొత్తులకు సై అన్నాయి. ఈ కోవలోకి ఇప్పుడు టీడీపీ కూడా చేరబోతోందా ?. బెంగుళూరు లో కుమారస్వామి ప్రమాణస్వీకార సభలో రాహుల్, చంద్రబాబుని చూసిన దగ్గర నుంచి ఈ తరహా వార్తలకు ప్రాధాన్యం పెరిగింది. అయితే రెండు పార్టీల్లో కూడా ఇది ఎంతవరకు సాధ్యం అన్న గందరగోళం లేకపోలేదు. ఈ గందరగోళానికి తెరదించాల్సింది రెండు హైకమాండ్స్. కానీ ఎన్నికలకి ఇంత ముందుగా అలాంటి విషయాలు మాట్లాడేందుకు ఇటు చంద్రబాబు, అటు రాహుల్ కూడా ఇష్టంగా లేరు.
ఇటీవలే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో తిరిగి చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు సైతం ఈ విషయంలో నోరు తెరవడానికి సిద్ధంగా లేరు.కానీ కొందరు నాయకులు మాత్రం ఈ విషయంలో కాస్త ముందుగానే నోరు తెరుస్తున్నారు. ఇంకో ప్రధాన విషయం ఏంటంటే… ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో కొనసాగుతున్న కేవీపీ, రఘువీరా లాంటి వాళ్లకు చంద్రబాబుతో పొత్తు ఇష్టం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు అది జరగాలని బలంగా కోరుకుంటున్నారు. ఏపీ పరిస్థితికి పూర్తి భిన్నం తెలంగాణ. ఇక్కడ సెటిలర్స్ ఓట్ల మీద ఎంతో ఆశ పెట్టుకున్న కాంగ్రెస్, టీడీపీ తో పొత్తు వల్ల మాత్రమే ఆ ఓట్లు తమ వైపు తిరుగుతాయని భావిస్తోంది. టీడీపీ తో పొత్తు కుదరాలి అని ఎక్కువమంది భావిస్తున్నారు. సర్వే సత్యనారాయణ లాంటి నాయకులు బహిరంగంగానే కార్యకర్తల సభలో బాబు మనతో కలుస్తాడని చెబుతున్నారు.