రేవంత్ రెడ్డిని అక్కడకి పంపుతున్నారా…?

Congress To Field Revanth Reddy In Parliament Elections

రేవంత్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడిచి కీలక నేతగా ఎదిగాడు. రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుని రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కయ్యాడు. అనంతరం జరిగిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్ గూటికి చేరుకున్నా చంద్రబాబుని పల్లెత్తు మాట అనకుండా తన గౌరవం నిలబెట్టుకున్నాడు. దీంతో ఆయనకు కీలక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టింది ఆ పార్టీ అధిష్ఠానం. తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ నుంచి కేసీఆర్‌పై పోరాటం చేస్తానని ప్రకటించిన రేవంత్ అదే దారిలో నడుస్తూ వచ్చాడు. అందుకే కేసీఆర్ కూడా రేవంత్‌ను టార్గెట్ చేశారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఆయనను ఓడించాలని గులాబీ బాస్ ఎన్నో ప్లాన్లు సిద్ధం చేసుకున్నారు. టీఆర్ఎస్ బాస్ అనుకున్నట్లుగానే రేవంత్‌ ఓటమి పాలయ్యారు. అయితే తాజాగా ఆయన విషయంలో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడిది రాష్ట్రంలో హల్‌చల్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రేవంత్‌ను వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయమని ఆయన అనుచరులు, పార్టీలోని కొందరు ముఖ్యులు ఒత్తిడి తెస్తున్నారట. ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన ఆయన కొడంగల్‌ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది, నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఈ విషయాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే రేవంత్ పార్లమెంట్‌కు పోటీ చేసి టీఆర్ఎస్‌కు బదులు చెప్పాలని పలువురు ఆయన దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్.. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ఉండడంతో ఆయనను అక్కడి నుంచే పోటీ చేయమని కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సూచాయగా చెప్పిందని సమాచారం. రేవంత్‌రెడ్డి ఆసక్తి కనబరిస్తే ఆయనకు టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి జితేందర్ రెడ్డి విజయం సాధించారు. అంతకుముందు ఎన్నికల్లో టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కూడా ఇక్కడి నుంచే గెలిచారు. అందుకే రేవంత్ పోటీ చేయడానికి ఇదే సరైన స్థానమని అంతా భావిస్తున్నారట. మరి ఏమి జరగనుందో తెలియాలంటే మరి కొన్నాళ్ళు ఆగాల్సిందే.