Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒక్కసారి అధికారంలోకి రాగానే ఆ కుర్చీ శాశ్వతం అనుకుంటారు ఎవరైనా. అందులో వారి తప్పుతో పాటు ఆ కుర్చీ ప్రభావం కూడా ఉంటుందేమో. అందుకే పవర్ లో వున్నప్పుడు పక్కనోడు బహు తేలిగ్గా కనపడతాడు అనుకుంటా. మోడీ ప్రధాని పీఠం, అమిత్ షా బీజేపీ అధ్యక్ష పీఠం ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళు ఇదే పద్దతిలో వెళ్తున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులనే కాదు మిత్రపక్షాల్ని, చివరకు సొంత పార్టీ లో పోటీ అనుకున్న వారిని కూడా అధపాతాళానికి తొక్కేస్తున్నారు. అయితే ఈ జంట కి దిమ్మతిరిగి పోయే షాక్ తగిలింది. మోడీ, షా ద్వయం దెబ్బకి నవ్వడమే మరిచిపోయిన కాంగ్రెస్ యువరాజు రాహుల్ మొహంపై చిరు నవ్వులు చిందాయి.
కాంగ్రెస్ కి అంత ఆనందాన్ని, బీజేపీ కి ఇంత షాక్ ఇచ్చింది మహారాష్ట్రలోని నాందేడ్ ఓటర్లు. అక్కడ మునిసిపల్ కార్పొరేషన్ కి జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ చిత్తు చిత్తు గా ఓడిపోయింది. మొత్తం 81 స్థానాలకు గాను 73 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ కేవలం ఆరంటే ఆరు స్థానాల్లో నిక్కినీలిగి గెలిచింది. శివసేన ఒక్క స్థానంలో, ఇండిపెండెంట్ ఇంకో స్థానంలో గెలిచారు. పీసీసీ అధ్యక్షుడు అశోక్ చవాన్ సొంత గడ్డ మీద కాంగ్రెస్ సాధించిన ఘన విజయం ప్రకంపనలు ఢిల్లీ దాకా చేరాయి. ఈ న్యూస్ విన్న రాహుల్ మొహం వెలిగిపోయింది. మంత్రులు ఎంతో మంది మకాం వేసినా ఘోర పరాజయం తప్పలేదని తెలుసుకున్న మోడీ, షా షాక్ అయ్యారట. ఇక హైదరాబాద్ పాత బస్తీ నుంచి నాందేడ్ వెళ్లి కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీల్చి 11 స్థానాలు గెలుచుకున్న ఎంఐఎం ఈసారి ఒక్క సీట్ కూడా గెలవలేదు. ఈ ఫలితాన్ని శివసేన ఆహ్వానించింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ కి తగలబోయే షాక్ ఎలా ఉంటుందో నాందేడ్ ప్రజలు ముందుగానే చెప్పారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.