Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత ప్రధాన న్యాయమూర్తి అభిశంసనపై కాంగ్రెస్ కు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురయింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా ఇచ్చిన అభిశంసన నోటీసును ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా… అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈ ఉదయం పిటిషన్ ను విచారించిన ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం నిబంధనల మేరకే ఉపరాష్ట్రపతి నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడింది. పిటిషన్ పై తదుపరి విచారణ ఉండబోదని స్పష్టంచేసింది. పార్లమెంట్ వేదికగానే దీన్ని తేల్చుకోవాలని ఆదేశించిన సుప్రీంకోర్టు… మీకు మీరుగానే పిటిషన్ వెనక్కు తీసుకోవాలని కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమ పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంటున్నామని కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ ధర్మాసనానికి తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలను కొట్టివేసింది.
సీజేఐ అభిశంసనపై ఉపరాష్ట్రపతి నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున కపిల్ సిబాల్ జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని బెంచ్ ముందు వాదనలు వినిపించారు. చీఫ్ జస్టిస్ పై వాదనలకు సంబంధించిన పిటిషన్ కనుక ఆయన తర్వాత సీనియర్ అయిన న్యాయమూర్తి దీనిపై నిర్ణయం తీసుకోగలరని, అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని కోరారు. పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు తీసుకెళ్లాలని జస్టిస్ చలమేశ్వర్ సూచించగా… సీజేఐ అభిశంసనకు సంబంధించినది గనుక ఆయన ధర్మాసనం ముందుకు తీసుకెళ్లలేనని కపిల్ సిబాల్ తెలిపారు. దీంతో మంగళవారం నిర్ణయం తీసుకుంటానని జస్టిస్ చలమేశ్వర్ చెప్పారు. కొద్దిగంటల్లోనే ఈ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేసింది.
సీనియార్టీలో ఆరోస్థానంలో ఉన్న న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె సిక్రీ నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అరుణ్ మిశ్ర, జస్టిస్ ఎ.కె.గోయల్ తో కూడిన ధర్మానసం ఈ ఉదయం కాంగ్రెస్ పిటిషన్ పై విచారణ చేపట్టింది. అయితే పిటిషన్ ను విచారించేందుకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేయాలని ఎవరు ఆదేశించారని కపిల్ సిబాల్ ప్రశ్నించారు. ఆ ఆదేశాల కాపీ తమకు ఇవ్వాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించలేదు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కాంగ్రెస్ ఎంపీలు తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు.