ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడి హత్యకు కుట్ర జరిగిందనే వార్తలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేగింది. ఆ కుట్రలో స్వయానా అయ్యన్న సోదరుడు, వైకాపాతోపాటు, కొంతమంది మావోయిస్టుల సాయంతో స్కెచ్ సిద్ధమైందనే అనుమానాలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. అయ్యన్న పాత్రుడి హత్య కుట్ర జరిగిందీ అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో హల్ చల్ చేస్తోంది. అయ్యన్న కుటుంబానికి సంబంధించినవారే ఆయన హత్యకు కుట్ర చేశారు అనే ఆరోపణలు ఆ వీడియోలో ప్రధానంగా వినిపించాయి. ఈ వీడియో దృష్ట్యా ప్రత్యర్థుల ఇళ్లపై అయ్యన్న అనుచరులు దాడులకు దిగినట్టుగా సమాచారం అందుతోంది. ఇంతకీ, ఆ వీడియోలో ఉన్నదేంటంటే మంత్రి సోదరుడు, నర్సీపట్నం మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షుడు సన్యాసి పాత్రుడు, స్థానిక వైకాపాకి చెందిన కొంతమంది నేతలు, మావోయిస్టు సానుభూతిపరులు మరికొందరు వీరందరూ ఒక హోటల్లో సమావేశమైనట్టుగా విజువల్స్ లో ఉంది. ఇంతకీ ఈ రహస్య సమావేశం ఎక్కడ, ఎందుకు జరిగిందనే కోణంలో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నిఘా వర్గాలు కూడా దీనిపై దృష్టి సారించినట్టు సమాచారం. అయితే, ఈ కుట్ర కథనాల నేపథ్యంలో అర్థమౌతున్నది ఏంటంటే మంత్రి అయ్యన్నపాత్రుడి కుటుంబంలోని కలహాలు మరోసారి బహిర్గతం అయినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకీ అయ్యన్న కుటుంబంలో పోరు ఏంటంటే ఆధిపత్య పోరు అన్నట్టుగా తెలుస్తోంది! మంత్రి కుమారుడు చింతకాయల విజయ్ గడచిన నాలుగేళ్లుగా రాజకీయంగా క్రియాశీలంగా ఉంటున్నారు.
నియోజక వర్గంలో యాత్రలు నిర్వహిస్తూ, కార్యకర్తలతో టచ్ లో ఉంటూ, ఇంకోపక్క మంత్రి నారా లోకేష్ కి సన్నిహితంగా ఉంటున్నారు. ఓరకంగా చెప్పాలంటే రాబోయే ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయడానికి కావాల్సిన నేపథ్యాన్ని విజయ్ దాదాపు సిద్ధం చేసుకున్నారు. దీంతో అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడి రాజకీయ భవిష్యత్తు కొంత ప్రశ్నార్థకంగా మారుతోందని ఆయన భావిస్తున్నారట. తన రాజకీయ ఎదుగుదలకు అనువైన పరిస్థితులు లేకుండా పోతున్నాయనే ఉద్దేశంతోనే అయ్యన్న కుటుంబంతో విభేదాలు పెరిగాయని చెప్పుకుంటున్నారు. ఈ కారణంతోనే బయటకి వ్యక్తులతో చేతులు కలిపి ఇలాంటి కుట్ర చేసి ఉంటారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. దాన్లో భాగంగానే కుట్రకు సంబంధించిన వీడియో బయటకి వచ్చిందని అయ్యన్న అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఇప్పటికే నిఘా వర్గాలు ఆరా తీయడం మొదలుపెట్టాయి. అయితే, ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో అయ్యన్న కుటుంబం నుంచి ఇంతవరకూ పోలీసులను ఆశ్రయించలేదనే తెలుస్తోంది. అంతేకాదు, విశాఖ జిల్లాలో ఇటీవలే మావోయిస్టులు ఇద్దరు నేతల్ని బలి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా సోషల్ మీడియాను చుట్టేస్తున్న ఈ వీడియోపై సన్యాసిపాత్రుడి కుమారుడు వరుణ్ స్పందించారు. తన తండ్రిపై పథకం ప్రకారం కుట్ర జరుగుతోందని, ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఎవరో కావాలనే ఇటువంటివి సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సన్యాసి పాత్రుడు కూడా స్పందించారు. ఆ వీడియోలో చెబుతున్నదంతా అబద్ధమని, తనపై పథకం ప్రకారం దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. ఈ నెల 21న ఓ వివాహానికి హాజరయ్యానని, అదే కార్యక్రమానికి నాతవరానికి చెందిన ప్రతిపక్ష నేతలు కూడా హాజరైనట్టు చెప్పారు. ఈ సందర్భంగా వరండాలో వారు ఎదురవడంతో మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నాం తప్ప మరేమీ లేదని స్పష్టం చేశారు. అక్కడి సీసీ టీవీ ఫుటేజీని సేకరించిన కొందరు దానిని తమకు అనుకూలంగా మార్చుకుని, హత్యకు కుట్ర జరుగుతున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ వీడియో వెనక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరారు. ఈ మేరకు మంగళవారం రాత్రి విశాఖపట్టణం ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు.