వినాయక నిమజ్జనం సమయంలో తలెత్తిన వివాదం అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని పెద్దపొలమడ, చిన్నపొలమడ గ్రామస్తులు, ప్రబోధానంద స్వామి అనుచరులకు వినాయక నిమజ్జన సమయంలో శనివారం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా ఆశ్రమం మీదుగా వెళ్లరాదని చిన్నపొడమల గ్రామస్తులను ప్రబోధానంద స్వామి వర్గీయులు నిన్న హెచ్చరించారు. దీనికి గ్రామస్తులు కూడా దీటుగా స్పందించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడిచేసుకునే దాకా వెళ్లింది.
దీంతో పలు వాహనాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. చిన్నపొలమడలో ఊరేగింపుగా వచ్చిన ట్రాక్టర్లు, గ్రానైట్ ఫ్యాక్టరీపై నిరసనకారులు దాడిచేసి ధ్వంసం చేశారు. ఈ ఘర్షణలు రెండో రోజూ కొనసాగాయి. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు అధికారులు బాష్పవాయువును ప్రయోగించారు. ఈ విషయం ఎంపీ దాకా వెళ్ళడంతో ఆయన నిన్న ఉదయం నుంచి తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నిన్న జరిగిన ఘర్షణల్లో దుండగులు ఇద్దరు వ్యక్తుల గొంతు కోశారు. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో పలు ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 2,000 మంది ప్రబోధానంద అనుచరులు, చిన్న పొడమల గ్రామస్తులకు ఈ ఘర్షణ చోటుచేసుకుంది.