విశ్వాన్నే వణింకించేస్తుంది కరోనా వైరస్. దీంతో ఈ మహమ్మారికి భయపడి ప్రపంచ జనాభాలో 75 శాతానికి పైగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆయా దేశాల్లో లాక్డౌన్ విధించడం జరిగింది. ఇక అత్యవసరమైతే.. మాస్కులు చుట్టుకొని బయటకు వెళ్తున్నారు. కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ తరుణంలో వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కులు వంటివి ధరించడం తప్పనిసరిగా మారింది.
అయితే.. ఇప్పటివరకూ మనుషులు మాత్రమే మాస్కులు ధరించడం చూశాం. తాజాగా మేకలకు కూడా మాస్కులు కట్టాడు తెలంగాణలోని ఖమ్మం జిల్లా వాసి. అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ పులికి కరోనా వైరస్ సోకినట్లు వార్తలు విన్న ఓ మేకల కాపరి తన మేకలకు కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కాగా ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామం ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెంకటేశ్వరరావు తాను పెంచుకుంటున్న మేకల మూతికి మాస్కులు కట్టి మేత కోసం తోడ్కొని వెళ్లాడు.
ఆ దృశ్యాలను విలేకరులు చిత్రించారు. దీంతో ప్రత్యేకంగా మేకలకు మాస్క్ లు పెట్టడంపై మాస్కుల పట్ల అవగాహన విపరీతంగా పెరిగింది. అయితే న్యూయార్క్ జూలో పులికి కరోనా సోకిన వార్తలతో తెలంగాణలో అటవీ శాఖ అధికారులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అప్రమత్తం చేశారు. వేసవి కావడంతో వన్యప్రాణులకు నీటి కొరత లేకుండా చూడాలని సూచించిన మంత్రి.. ఇదే సమయంలో కరోనా వ్యాపించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడో విషయం తెలుసుకోవాలి.
ఖమ్మం జిల్లాలో తాజాగా తొలి కరోనా కేసు నమోదైంది. పెద్దతండాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతడు కూడా ఢిల్లీలోని మర్కజ్ సమావేశాలకు వెళ్లొచ్చిన వారిలో ఉన్నాడు. అయితే అతడిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం సర్వత్రా కలకలం రేపుతోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలేవీ అతడికి లేవని అయినా సరే కరోనా పాజిటివ్ రావడంతో లాక్డౌన్ ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.