ప్రమాదకర స్థాయికి చేరుతున్న భారత్

ప్రమాదకర స్థాయికి చేరుతున్న భారత్

భారత ప్రభుత్వం కరోనాను కట్టడి చేయడంలో సమర్థంగా వ్యవహరించిందని.. లాక్ డౌన్‌ను చాలా పకడ్బందీగా అమలు చేసిందని అందరూ తెగ పొగిడేశారు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)తో పాటు ప్రపంచ దేశాలు కూడా భారత్‌ను పొగిడాయి. కానీ నెలన్నరకు మించి లాక్‌డౌన్‌ను భరించే శక్తి లేక ప్రభుత్వం నాలుగో దశ లాక్ డౌన్‌ నుంచి చాలా మినహాయింపులు ఇచ్చేసింది.

ఇప్పుడు నామమాత్రంగా నడుస్తోంది లాక్ డౌన్. జనాలు మామూలుగానే తిరిగేస్తున్నారు. అన్ని వ్యాపారాలూ నడుస్తున్నాయి. కానీ దేశంలో లాక్ డౌన్‌ ఎత్తేశారంటే కరోనా ప్రభావం తగ్గిపోయిందని ఎంతమాత్రం కాదని కేసుల సంఖ్య చూస్తే స్పష్టమవుతోంది. వైరస్ వ్యాప్తి ఇప్పుడే మనం పీక్స్‌ను చూస్తున్నాం. ఇలాంటి సమయంలో లాక్ డౌన్ అత్యంత అవసరమని స్పష్టమవుతోంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ను పరిశీలిస్తే కరోనా వ్యాప్తి పెరుగుతున్న దశలో లాక్ డౌన్ అమలు చేశారు. వైరస్ ప్రభావం బాగా తగ్గాక లాక్ డౌన్ ఎత్తారు. దీంతో అక్కడ పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. కరోనా కారణంగా దారుణంగా దెబ్బ తిన్న ఇటలీ, స్పెయిన్, జర్మనీ, బ్రిటన్.. ఈ దేశాలన్నీ కూడా లాక్ డౌన్‌‌తో సత్ఫలితాలు సాధించాయి. కరోనా కర్వ్ డౌన్ అయ్యాకే లాక్ డౌన్‌ను సడలించాయి.

లాక్ డౌన్ మొదలైన కొంత కాలానికి కరోనా పీక్స్‌కు చేరుకుని.. ఆ తర్వాత నెమ్మదించింది. అప్పుడు సడలింపులు వచ్చాయి. కానీ ఇండియాలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా జరిగింది. కరోనా పతాక స్థాయిని అందుకుంటున్న దశలో లాక్ డౌన్‌ను సడలించారు. ఇప్పుడు ఇంకా ప్రమాదకర స్థాయికి చేరుకున్నాం.

వైరస్ ప్రభావం ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు ఈ కర్వ్ డౌన్ అవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. దీనికి సంబంధించిన గ్రాఫ్‌ను కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో షేర్ చేశాడు. దాన్ని చూస్తే ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో తప్పటడుగు వేసిందని స్పష్టమవుతోంది.