కరోనాతో ప్రపంచాన్ని గడగడలాడించిన చైనాను ఇప్పుడు మరో మహమ్మారి ముప్పు భయపెడుతోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న డ్రాగన్ ప్రజలను అంతుచిక్కని న్యుమోనియా వణికిస్తోంది. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్తున్న చిన్నారులు ఈ న్యుమోనియా బారిన పడుతున్నట్లు సమాచారం.
దగ్గు లేకపోయినా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్, శ్వాససంబంధ ఇబ్బందులు, జ్వరం వంటి లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారని ప్రోమెడ్ సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా పాఠశాలలను మూసివేసినట్లు తెలిపింది. కరోనాలాగా మరో మహమ్మారిగా మారే అవకాశాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని వెల్లడించింది. కరోనా ఆంక్షలు సడలించినప్పటి నుంచి చైనా అంటువ్యాధులతో సతమతమవుతోందని పేర్కొంది.
ఉత్తర చైనాలో అంతుచిక్కని న్యుమోనియా లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) స్పందించింది. జబ్బు లక్షణాలు, అనారోగ్యానికి గురవుతున్న చిన్నారులుండే ప్రాంతాల వివరాలు ఇవ్వాలని కోరుతూ.. ఈ జబ్బు వ్యాప్తి చెందకుండా చైనా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.