ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (కోవిడ్ 19) పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం మరో 11 మందికి కరోనా పాజిటివ్ రాగా, మొత్తం కేసులు 314కు చేరుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుల్లో ఎక్కువగా ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. రాష్ట్రంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు జరిగిన కోవిడ్ 19 పరీక్షల్లో కొత్తగా గుంటూరు జిల్లాలో 8, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. కొత్తగా నమోదైన 10 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 314కి పెరిగిందని తెలిపింది. కాగా, సోమవారం 37 కేసులు నమోదు కాగా, కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 303కు చేరింది. మంగళవారం మరో 11 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 314కు చేరింది.

కర్నూలులో ఒక్క రోజు వ్యవధిలో 70 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం వరకు నాలుగుగా ఉన్న కరోనా వైరస్ కేసులు ఒక్క సారిగా పెరిగిపోయాయి. దీంతో సోమవారం సాయంత్రానికి కర్నూలు జిల్లాలో మొత్తం కరోనా కేసులు 74కు చేరుకున్నాయి. అయితే మంగళవారం కర్నూలులో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే గుంటూరులో మంగళవారం ఒక్కరోజే 9 కరోనా కేసులు పెరిగాయి. దీంతో కర్నూలులో అత్యధికంగా 74 కేసులు నమోదు కాగా, నెల్లూరులో 42 కేసులతో రెండో స్థానంలోనూ, గుంటూరు జిల్లా 41 కేసులతో మూడో స్థానంలో, కృష్ణా జిల్లా 29 కరోనా కేసులతో నాలుగో స్థానంలో నిలిచాయి.

రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో కలిసి కరోనా వైరస్ కేసులు 314 నమోదు కాగా, కేవలం మూడు జిల్లాల్లోనే 158 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో 42 కేసులు, గుంటూరులో 41, కృష్ణాలో 29, కడపలో 27, ప్రకాశంలో 24 జిల్లాలో కరోనా కేసుల చొప్పున నమోదయ్యాయి. ఈ ఆరు జిల్లాలో కలిసి 238 కరోనా కేసులు నమోదు కాగా, మిగిలిన ఏడు జిల్లాల్లో కలిపి 76 కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కేసులేవీ నమోదు కాకపోవడం విశేషం.