తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. నిన్న కేవలం ఆరు కేసులే నమోదు కావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న వైద్యారోగ్య శాఖకు నేడు మళ్ళీ షాక్ తగిలింది. నేడు కొత్తగా మరో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు మంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు.
అయితే ఈ రోజు ఎవరూ చనిపోలేదని, కరోనా నుంచి కోలుకున్న 68 మందిని నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నామని అన్నారు. అయితే వీరందరికి 14 రోజుల తరువాత నిన్న నిర్వహించిన తొలి టెస్ట్‌లో కరోనా నెగిటివ్ వచ్చిందని, ఈ రోజు పరీక్షలలో కూడా నెగిటివ్ రావడంతో వారందరిని డిశ్చార్జ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కేవలం ముగ్గురికి మాత్రమే వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నామని, మిగతా వారి పరిస్థితి మామూలుగానే ఉందని చెప్పుకొచ్చారు