మే నెలాఖరికి ముంబైలోనే 70వేల మందికి కరోనా..

దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ కాదు గంటగంటకూ పెరుగుతుంది. దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో 40 శాతం మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఇందులో కూడా ముంబైలోనే 70 శాతం ఉన్నాయి. దేశంలో ఇప్పటికే కరోనా వైరస్ కేసుల సంఖ్య 23వేలు దాటింది. అందులో గురువారం ఒక్కరోజే 1,755 కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారంతో పోల్చితే గురువారం కేసుల పెరుగుదల రేటు 8.2 శాతంగా ఉంది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కేసులు నమోదయ్యయి. గడచిన 24 గంటల్లోనే ఆ రాష్ట్రంలో 778 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. ముంబై నగరంలోనే దాదాపు 500 మందికి వైరస్ సోకింది. దీంతో ముంబైలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,200కి చేరింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఒక్క ముంబయిలోనే మేనెల చివరి నాటికి 70వేల మంది వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఓ సర్వే తేల్చింది.

కాగా వైరస్ తీవ్రతను బట్టి మే నెలాఖరికి కరోనా వైరస్ బాధితుల కోసం అదనంగా మరో మూడువేల కోవిడ్-కేర్ బెడ్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలను బీఎంసీ చేస్తోంది. వీటితోపాటు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జీటీ హాస్పిటల్, సెయింట్ జార్జ్ హాస్పిటల్స్‌ను కూడా బీఎంసీ స్వాధీనం చేసుకోవాలని భావిస్తోంది. ఈ రెండు హాస్పిటల్స్‌లో 600 వరకు బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా కరోనా బాధితులకు చికిత్స అందజేసే హాస్పిటల్స్‌ను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం వల్ల మహమ్మారిని మరింత సమర్ధంగా నియంత్రించడానికి అవకాశం ఉంటుందని బీఎంసీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హాస్పిటల్స్‌లో ఆక్సిజన్, వెంటిలేటర్ సదుపాయాలను కల్పించాలని పేర్కొన్నారు.

అంతేకాకండా ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారవీలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదౌతున్నాయి. ఇప్పటి వరకూ అక్కడ 250 మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. ఇక్కడ వైరస్ విజృంభించకుండా చర్యలు చేపట్టినా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ‘టైమ్స్ ఫ్యాక్ట్ ఇండియా ఔట్‌బ్రేక్ రిపోర్ట్’ పేరుతో నివేదికను రూపొందించి మూడు వేర్వేరు అంశాలను పరిగణలోకి తీసుకొని సర్వే నిర్వహించింది. దీంతో సుమారు మే 22వ తేదీ నాటికి దేశంలో 75,000పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తేల్చింది.