ఒడిశా కేంద్రంగా నడుస్తున్న బౌద్ధ డిస్టిలరీస్‌లో వరుసగా ఆరో రోజు ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగాయి. పట్టుబడిన నగదులో ఇప్పటివరకు 353 కోట్ల రూపాయలను లెక్కించారు. ఇంకా పదుల సంఖ్యలో బ్యాగుల్లో నగదు లెక్కించాల్సి ఉందని ఆదాయపన్ను శాఖ అధికారులు తెలిపారు. సంబల్పుర్, తిత్లాగఢ్, సుందర్‌గఢ్, బాలంగిర్, భువనేశ్వర్ ప్రాంతాల్లో సోదాలు నిర్ హించినట్లు వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు వద్ద దొరికిన ఈ నల్ల డబ్బు ఎవరిదని బిజేపి ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా ఐటీ తనిఖీలు వరుసగా ఆరో రోజు కొనసాగాయి. పన్ను ఎగువేత ఆరోపణలు ఎదుర్కొంటున్న బౌద్ధ డిస్టిలరీస్‌కు చెందిన యూనిట్లపై దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్న నగదులో 353 కోట్ల రూపాయలను ఇప్పటివరకు లెక్కించారు. ఓ దర్యాప్తు సంస్థ చేపట్టిన సోదాల్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం దేశంలో ఇదే తొలిసారని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. తనిఖీల్లో భాగంగా సీజ్ చేసిన డాక్యుమెంట్లపై ప్రస్తుతం దృష్టి సారించినట్లు వివరించింది. 176 బ్యాగుల్లో140కి పైగా బ్యాగుల్లోని నగదు కౌంటింగ్ పూర్తయిందని బాలం గిర్ ఎస్బీఐ రీజినల్ మేనేజర్ తెలిపారు. మిగిలిన నగదును ఇంకా లెక్కించాల్సి ఉందని వెల్లడించారు. నగదు లెక్కింపులో 50 మంది బ్యాంకు సిబ్బంది పాలు పంచుకుంటున్నరని వివరించారు. 40 కౌంటింగ్ మెషిన్లను తెప్పించగా వాటిలో 25 మెషిన్లను నోట్ల లెక్కింపునకు వాడుతున్నామని చెప్పారు..
మరోవైపు ఈ వ్యవహారంపై పార్లమెంటు బయట భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎంపీలు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు వద్ద దొరికిన నల్ల డబ్బు ఎవరిదని ప్రశ్నించారు. ఐటీ దాడులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్, అవినీతి ఒకే నాణానికి రెండు ముఖాలు లాంటివని జేపీ నడ్డా విమర్శించారు. భారీ స్థాయిలో నగదు వెలుగులోకి రావడం పై కేం ద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం పై ఇండియాకూటమి ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. అవినీతి అనేది కాంగ్రెస్ స్వభావం కాబట్టి ఆ పార్టీ నిశ్శబ్దంగా ఉందని…. కానీ జేడీయూ, ఆర్జేడీ, ఎస్పీ, డీఎంకే పార్టీలు ఎందుకు మౌనం వహిస్తున్నాయని ప్రశ్నించారు.