తనను మోసం చేసిన భార్యా – ఆమె ప్రియుణ్ణి నగ్నంగా ఊరేగించిన భర్త !

Couple paraded naked in Rajasthan

దేశంలో తరచూ జరుగుతోన్న కొన్ని ఘటనలు చూస్తుంటే మనం నాగరిక సమాజంలో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది. రాజస్థాన్‌లో జరిగిన అమానుష ఘటన తెలుసుకుంటే ఒళ్ళు జలదరించక మానదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే అక్కసుతో ఓ జంటను గ్రామస్థులు బట్టలు ఒలిచేసి చెట్టుకు కట్టేయడమే కాకుండా, వారిని అలాగే నగ్నంగా ఊరేగించారు. ఈ మానవీయ ఘటన ఉదయ్‌పూర్ సమీపంలోని సెర్ ఖుర్డ్ గ్రామంలో జరిగింది. దీన్ని అందరూ వినోదంలా చూశారు తప్పితే, ఒక్కరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

పోలీసుల వివరాల ప్రకారం రామ్‌లాల్ గామేటి (20) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మహిళ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అంతకు ముందే వేరో వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజుల తర్వాత రామ్‌లాల్‌తో పరిచయం ప్రేమకు దారితీయడంతో మొదటి భర్త నుంచి విడిపోయింది. అనంతరం రామ్‌లాల్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దీంతో మొదటి భర్త తన బంధువులతో కలిసి శుక్రవారం నాడు వీరిపై దాడిచేసి దుస్తులు విప్పి గ్రామంలో ఊరేగించాడు. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని సుఖేర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గిరిరాజ్ సింగ్ తెలిపాడు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితులను వారి నుంచి విడిపించారు. 2017 ఏప్రిల్‌లో కూడా ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో చోటు చేసుకున్న విషయం విదితమే. ఇద్దరు యువతీ యువకులు ప్రేమ పెళ్లి చేసుకున్నారని.. వారిని తీవ్రంగా కొట్టి… వేధించి.. నగ్నంగా ఊరేగించారు. ఈ కేసులో 18 మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో ప్రేమికుల తండ్రులు కూడా ఉన్నారు.