Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నా…భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ప్రేయసి అనుష్క శర్మ గురించి మీడియా ముందు పెద్దగా మాట్లాడడు. మీడియాలో వారిద్దరి గురించి వచ్చే వార్తలన్నీ…ఇతరుల నుంచి సేకరించిన సమాచారం ద్వారానే తెలిసినవే. ప్రేయసితో కలిసి బహిరంగంగా కనిపించినప్పటికీ…వ్యక్తిగత విషయాలను మాత్రం కోహ్లీ గోప్యంగానే ఉంచుతాడు. తాజాగా ఓ హిందీ టీవీ చానల్ నిర్వహించిన ఒక షోలో కోహ్లీ తన ప్రేయసి గురించిన సంగతులతో పాటు అనేక విషయాలను వెల్లడించాడు. దీపావళి రోజు ప్రసారంచేసేందుకు ఓ హిందీ చానల్ బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్, విరాట్ కోహ్లీతో చాట్ షో నిర్వహించింది. కార్యక్రమంలో భాగంగా అమీర్ కోహ్లీని కొన్ని ప్రశ్నలు వేశాడు. అనుష్క శర్మలో నచ్చేవి, నచ్చని అంశాలు ఏమిటని ప్రశ్నించాడు. అనుష్క నిజాయితీ, జాగ్రత్తగా చూసుకునే స్వభావం తనకు ఎంతో నచ్చుతాయని కోహ్లీ చెప్పాడు. అనుష్కలో తనకు నచ్చని విషయం…ఎప్పుడూ చెప్పిన టైంకు రాకుండా కొంచెం ఆలస్యంగా వస్తుందని…ఇది తనకు నచ్చదని చెప్పాడు. అయితే ఆ ఆలస్యం కొంచెమే కాబట్టి పెద్దగా ఇబ్బంది అన్పించదని తెలిపాడు. చీకూ అనే ముద్దుపేరు ఎలా వచ్చిందో కూడా కోహ్లీ అమీర్ ఖాన్ కు వివరించాడు.
అండర్ -17 క్రికెట్ ఆడే సమయంలో పెద్దగా ఉన్న తన చెవులను పొడవాటి జుట్టుతో కప్పి ఉంచేవాడినని, ఆ హెయిర్ స్టయిల్ చూసి సహచర ఆటగాళ్లు తనను చీకూ రాబిట్ అని పిలవడం మొదలుపెట్టారని…తర్వాత కెప్టెన్ ధోనీ కూడా అలాగే పిలిచేవాడని తెలిపాడు. స్టంప్స్ వెనకాల ఓసారి ధోనీ తనను చీకూ అని పిలవడం మైక్ లో రికార్డు కావడంతో ఆ పేరు ప్రచారంలోకి వచ్చిందని కోహ్లీ తెలిపాడు. అమీర్ ఖాన్ నటించిన సినిమాల్లో తనకు జో జీతే వోహి సికిందర్, త్రి ఇడియట్స్, పీకె ఇష్టమన్నాడు. దీనికి అమీర్ ఖాన్ స్పందిస్తూ…అనుష్క నటించింది కాబట్టి పీకె అంటే నీకు ఇష్టమని నాకు తెలుసు అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించాడు. కార్యక్రమం చివర్లో అమీర్ ఖాన్, కోహ్లీ పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారు. దంగల్ సినిమా కోసం కొట్టిన ఫస్ట్ క్లాప్ క్లాపర్ ను అమీర్ కోహ్లీకి బహూకరించాడు. తాను ధరించిన టీమిండియా జెర్సీని కోహ్లీ అమీర్ కు అందించాడు. ఆ గిఫ్ట్ లను చేతుల్లో పెట్టుకుని వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.