క్రికెటర్ లిటన్ దాస్ భార్యకి సిలిండర్ పేలి తీవ్ర గాయాలు

క్రికెటర్ లిటన్ దాస్ భార్యకి సిలిండర్ పేలి తీవ్ర గాయాలు

గ్యాస్ సిలిండర్ పేలి బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ భార్య దేవశ్రీ బిస్వాస్ సంచిత తీవ్ర గాయాలైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. గత శుక్రవారం వంట గదిలో టీ పెడుతుండగా.. సిలిండర్ పేలడంతో సంచిత చేతులు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి.

గ్యాస్ సిలిండర్‌‌కు రంధ్రం పడి ఉండంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు లిటన్ దాస్ కుటుంబ సభ్యులు మీడియాకు వివరణ ఇచ్చారు. ఆ రంధ్రం ద్వారా గ్యాస్ లీకైందని ..పేలుడు సమయంలో సంచిత తన చేతుల్ని ముఖానికి అడ్డుపెట్టడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. అయితే.. పేలుడు కారణంగా ఆమె జుట్టు చాలా వరకూ కాలిపోయిందని.. శరీరంపైనా అక్కడక్కడ గాయాలయ్యాయని తెలిపారు.

ఈ ప్రమాదంపై సంచిత తాజాగా మాట్లాడుతూ ‘ఆ ప్రమాదం గురించి చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. చావుకి చాలా దగ్గరగా వెళ్లినట్లు అనిపించింది. నా చేతులతో ముఖాన్ని కవర్ చేసుకోలేకపోతే.. నా ముఖం మొత్తం కాలిపోయేది. నిప్పు అంటుకుని ఉండటంతో.. నా హెయిర్‌ని కూడా కట్ చేయాలని వైద్యులు తెలిపారు. ఒకవేళ నా ముఖం కాలి ఉంటే ఏం జరిగేదో తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి’అని తెలిపింది.

బంగ్లాదేశ్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం క్రికెటర్లతో పాటు లిటన్ దాస్ కూడా ఇటీవల తన సగం జీతాన్ని విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. 2019 వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత సంచితని లిట్టన్ దాస్ వివాహం చేసుకున్నాడు.