మాజీ మంత్రి, మచిలీపట్నం MLA పేర్ని నాని అనుచరులపై చిలకలపూడి స్టేషన్లో కేసు నమోదైంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం ఉల్లిపాలెంలో చోటుచేసుకున్న దాడి ఘటనలో నిందితులైన వైకాపా సానుభూతిపరులను తాలూకా స్టేషన్ కు పిలిపించి SI కొట్టారనే కారణంతో మంగళవారం పేర్ని నాని పెద్ద ఎత్తున అనుచరులతో వెళ్లి పోలీస్ స్టేషన్ వద్ద హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్టేషన్ వద్ద ఫర్నిచర్, సీసీ కెమెరాలు ధ్వంసం చేయడంతో పాటు పోలీసులను దుర్భాషలాడారు. వైకాపా కార్పొరేటర్లు సుబ్బన్న, అస్గర్ అలీ, రాంబాబు, మరికొంత మంది కార్యకర్తలు స్టేషన్ ముందు, పక్కన ఉన్న సీసీ కెమెరాలతో పాటు పోలీస్ జీపునకు ఉన్న సైరన్‌ను ధ్వంసం చేశారంటూ కానిస్టేబుల్ హరికృష్ణ చిలకలపూడి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కేఎన్వీ సత్య నారాయణ తెలిపారు.
వైకాపా కార్యకర్తలను స్టేషన్‌కు పిలిపించి కొట్టారన్న అభియోగంపై మచిలీపట్నం తాలూకా SI చాణక్యను వీఆర్‌కు పంపుతూ ఎస్పీ నయీమ్ అస్మి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడిన పేర్ని నానిపై కేసు నమోదు చేయకుండా SIను గంటల వ్యవధిలోనే వీఆర్‌కు పంపడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనపై పోలీసు ఉన్న తాధికారులతో పాటు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెదేపా, జనసేన నాయకులు వెల్లడించారు.