కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందినా, మానసిక స్థితి బాగోలేని తల్లి, సోదరుడు గుర్తించలేకపోయారు. శవం ఇంట్లోనే కుళ్లిపోయి, పురుగులు పడుతున్నా… అదేమీ పట్టించుకోకుండా సాధారణ జీవితం గడిపారు. పక్కింట్లో ఉండే యువకులు గుర్తించడంతో మృతి విషయం వెలుగుచూసింది. స్థానికులను కలవరపాటుకు గురిచేసిన ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల ఠాణా పరిధిలోని చింతల్లో చోటుచేసుకుంది. స్థానిక ఇన్స్పెక్టర్ ఎం.పవన్ తెలిపిన వివరాల మేరకు… ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం వెంకటపురం గ్రామానికి చెందిన ముక్కు రాధాకుమారి (45), ఆమె తల్లి విజయలక్ష్మి, సోదరుడు పవన్ అయిదేళ్ల క్రితం నగరానికి వచ్చి చింతల్లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. రాధాకుమారి 20 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె సోదరుడు పవన్, తల్లితో కలిసి ఉంటున్నారు. కొన్నేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించినా పరిస్థితి మెరుగుపడలేదు. రెండేళ్లుగా ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. రాధాకుమారి సోదరుడు ఓ ఫార్మా సంస్థలో పనిచేస్తున్నారు. తల్లి మానసిక స్థితి బాగోలేక పోవడంతో ఇద్దరినీ ఆయనే చూసుకుంటున్నారు. పవన్ మానసిక స్థితి కూడా క్రమంగా క్షీణించడంతో రెండు నెలల క్రితం సంస్థ విధుల నుంచి తొలగించింది.
దీంతో తరచూ బయటకు వచ్చే పవన్ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు. వారం రోజుల క్రితం సోదరి ఊపిరి పడకపైనే ఆగినా గుర్తించలేని దీన స్థితిలో ఉన్నారు. రోజులు గడిచినా సోదరి మృతి చెందినట్లు పవన్ గుర్తించలేక పోయారు. పక్కింట్లో ఉండే యువకులు అప్పుడప్పుడు పవన్ ద్విచక్ర వాహనం తీసుకునేవారు. అలాగే వారు మంగళవారం రాత్రి ఇంటి తలుపు తట్టారు. తలుపులు తీయడంతో తీవ్ర దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించారు. లోపలికి వెళ్లిచూడగా మంచంపై రాధాకుమారి మృతిచెంది ఉంది. మీ సోదరి చనిపోయిందని చెబుతున్నా .. అతడు ఏమీ తెలియనట్లు వ్యవహరించడంతో ఆ యువకులు భయపడి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.