విశాఖ జిల్లా మధురవాడ కొమ్మాదిలో తహసీల్దార్ దారుణ హత్యకు గురైన కేసులో నిందితుడిని గుర్తించినట్లు విశాఖ సీపీ రవిశంకర్ వెల్లడించారు. ఇద్దరు ఏసీపీలను నియమించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను శనివారం సీపీ మీడియాకు వివరించారు. ‘‘నిందితుడు ఎయిర్పోర్టు వైపు ప్రయాణించినట్లు గుర్తించాం. రైల్వే టికెట్ బుక్ చేసినట్లు ఆధారాలు లభించాయి. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో గాలిస్తున్నాం. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం ’’ అని సీపీ వెల్లడించారు.
విశాఖ రూరల్ (చినగదిలి) తహసీల్దార్గా ఉన్న సనపల రమణయ్య ఎన్నికల నేపథ్యంలో ఇటీవల విజయనగరం జిల్లాలోని బొండపల్లికి బదిలీ అయ్యారు. కొమ్మా దిలోని ఓ అపార్ట్మెంట్ ఐదో అంతస్తులో నివాసం ఉండే ఆయన.. శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఫోన్ రావడంతో కిందకు వచ్చి అపార్ట్మెంట్ గేట్ వద్ద ఓ వ్యక్తిని కలిసినట్లు సీసీటీవీ ఫుటేజ్లో నమోదైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో దుండగుడు ఇనుపరాడ్తో తహసీల్దార్పై ఒక్క సారిగా దాడి చేసి పరారయ్యాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మృతి చెందారు.