కరోనా మహమ్మారి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో జనం భయభ్రాంతులకు గురౌతున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా నెలనుంచి దేశమంతా లాక్డౌన్ లో ఉంది. అయినా కేసులు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. అయితే ఏరంగాన్ని విడిచి పెట్టకుండా కరోనా కలకలం సృష్టిస్తోంది. అన్నింటినీ తాకి దాని అంతు తేలుస్తోంది కరోనా వైరస్.
అయితే కరోనా బారిన పడి తాజాగా సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ ఎస్ఐ మృతి చెందడంతో ఢిల్లీలో కలకలం రేగింది. కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన 55 ఏళ్ల సీఆర్పీఎఫ్ ఎస్ఐ మహ్మద్ ఇక్రం హుసేన్ మృత్యువాత పడ్డాడు. 31వ సీఆర్పీఎఫ్ బెటాలియన్‌లో మరో 45మందికి కూడా కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో బెటాలియన్‌కు సీలు వేశారు అధికారులు. ఈ బెటాలియన్‌లో 1100 మంది జవాన్ల వరకు ఉండగా.. మరో 257 మందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు.
వారందరినీ క్వారంటైన్ కోసం ఆస్పత్రులకు తరలించారు. అయితే.. వీరి రిపోర్ట్లు రావాల్సి ఉంది. అంతేకాకుండా సీఆర్పీఎఫ్ ఎస్ఐ మృతిపై తన సంతాపాన్ని వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. సీఆర్పీఎఫ్ లో కరోనా వైరస్ ప్రబలకుండా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించి అప్రమత్తంగా ఉండాలని కోరారు.