దానం నాగేందర్, హైదరాబాద్‌లో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. యువజన కాంగ్రెస్ నేతగా హైదరాబాద్ రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఆసీఫ్‌నగర్ నుంచి రెండు సార్లు, ఖైరతాబాద్ నుంచి ఒకసారి గెలిచి మంత్రి పదవి కూడా నిర్వహించారు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రియ శిష్యుడిగా పేరు సంపాదించుకున్న దానం వై.ఎస్ మృతి చెందిన తరువాత తనేమీ తక్కువకానట్లు వ్యవహరిస్తుంటాడు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసి హైదరాబాద్ నగర రాజకీయాల్లో తనకు మించిన వాడు లేడని విర్రవీగిన దానంకు గత ఎన్నికల్లో ఖైరతాబాద్ ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారు.
మొదట్లో సమైక్యవాదిగా ఉన్న దానం తెలంగాణా ఉద్యాకారుల మీద లాఠీతో వెంట పడి మరీ కొట్టాడు. ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమో గత ఎన్నికల సమయంలో తెలంగాణకు జైకొట్టారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమసమయంలో ఆయన అప్పటి విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌కు సహాయం చేశారనే పేరుంది. అటువంటి ఆయనకు ఎన్నికల సమయంలో తెలంగాణ ఓటర్లు గుణపాఠం నేర్పారు.
ఆది నుంచి వివాదాస్పదమైన నేతగా పేరున్న ఈయన గతంలో టిడిపి నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నికల సమయంలో తనకు కాంగ్రెస్ టిక్కెట్ రాలేదని టిడిపిలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం టిడిపి ప్రభుత్వం ఓడిపోవడంతోనే కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళితే ప్రజలు కొర్రుకాల్చి వాతపెట్టారు. అయినా అప్పటి తన గురువు వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి అండతో ఏదో నేట్టుకోచ్చేసాడు. ఇదంతా గతం ఇప్పుడు ఆయన మరోసారి ఖైరతాబాద్ నుంచి అధికార పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో ఆయన సంగతి తేల్చాలని అటు కాంగ్రెస్, ఇటు టిడిపి టార్గెట్‌గా పెట్టుకున్నాయి. మొన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉండి బీసీలకు ‘కెసిఆర్’ పెద్దపీట వేస్తున్నా డంటూ టిఆర్‌ఎస్‌లోకి చేరిన దానంకు కెసిఆర్ మొదట్లోనే చుక్కలు చూపించారు. ఖైరతాబాద్ టిక్కెట్ తనకే ఇస్తారని మొదటి నుంచి భావించిన దానంకు ఆఖరి నిమిషం వరకు టిక్కెట్ ఇవ్వకుండా తన వద్ద ఎలా ఉంటుందో తొలిసారి రుచి చూపించారు కెసిఆర్.
దీంతో ఏదో విధంగా చివరకు నిన్న టిక్కెట్ ఓకే చేయించుకున్న దానంను ఒక చూపు చూడాలని..కూటమి నేతలు భావిస్తున్నారు. గతంలో తమ పార్టీలో ఉండి..తమనే ఇబ్బంది పెట్టిన దానంపై కక్ష తీర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా పాత లెక్కలు సరిచేసి గుణపాఠం నేర్పాలని టిడిపి చూస్తోంది. దీంతో ఇప్పుడు ఇక్కడ గెలవడం కోసం చెమటలు కక్కుతున్నారు నాగేందర్. అసలే నగరంలో టిఆర్‌ఎస్‌పట్టు అంతంత మాత్రం. పైగా ఈ నెలలోనే చంద్రబాబు నాయుడు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీలు రోడ్‌షోలతో హోరెత్తించబోతున్నారు. మధ్యతరగతి, ఐటి ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు, సీమాంధ్రులు చంద్రబాబుకు ఆకర్షితులు అవుతుండగా ఎస్సీ,ఎస్టీ,వెనుకబడిన తరగతులు వారిని రాహుల్ ఆకర్షిస్తారని భావిస్తున్న
నేపథ్యంలో దానం ఓటమి ఖాయమేనని పరిశీలకులు భావిస్తున్నారు. విచిత్రంగా సెంటిమెంట్ కూడా దానంకు వ్యతిరేకంగా ఉంది. ఆయన ఆఖరి నిమిషంలో ఏ పార్టీ వైపు ఫిరాయిస్తారో ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడం.ఖాయమనే సెంటిమెంట్ ఉంది. నగర రాజకీయాల్లో ఆయనకు ఐరెన్‌లెగ్‌గా పేరుంది. మరి ఇప్పుడు ఈసెంటిమెంట్‌ను దాటి గెలుస్తారా అనేది ఆశ్చర్యార్ధకమే.