డేంజర్: ఇప్పడే మరింత అప్రమత్తంగా ఉండాలి: డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కేసులు త‌గ్గుముఖం పడుతోన్న ఈ సమయంలో కొన్ని దేశాలు ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే నిబంధ‌న‌ల‌ను సుల‌భ‌త‌రం చేస్తున్న దేశాలు అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తోంది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ.  వైర‌స్ అత్యంత వేగాన్ని త‌గ్గించ‌డంలో కొన్ని దేశాలు స‌ఫ‌లం అయ్యాయ‌ని.. దీని వ‌ల్ల ఎంతో మంది ప్రాణాల‌ను కాపాడగలిగారని డబ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ టెడ్రోస్ వెల్లడించారు. జ‌నీవాలో వ‌ర్చువ‌ల్ మీడియా స‌మావేశంలో పాల్గొన్న ఆయ‌న ఈ విష‌యాన్నితెలిపారు.

అదేవిధంగా ఆంక్ష‌ల‌ను ఎత్తివేయ‌డం అంటే అది ఆశ‌కు సంకేత‌మ‌ని.. డ‌బ్ల్యూహెచ్‌వో ఎమ‌ర్జెన్సీ చీఫ్ మైఖేల్ ర్యాన్ తెలిపారు. కానీ అన్ని దేశాలు కూడా ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌స్ వ‌ల్ల రెండు ల‌క్ష‌ల 80 వేల మంది మ‌ర‌ణించగా.. సుమారు 40 ల‌క్ష‌ల మందికి వైర‌స్ బారిన పడ్డారు. ప్ర‌జా ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌టిష్టం చేయాల‌ని ర్యాన్ ఆయా ప్ర‌భుత్వాల‌ను కోరారు. కొత్త కేసుల‌ను గుర్తించి.. వారిని ఐసోలేట్ చేసి.. చికిత్స అందించాల‌ని వెల్లడించారు. దీంతో రెండో ద‌ఫా కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉందని స్పష్టం చేశారు. కాగా వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేయ‌కపోతే క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్‌కు దారి తీస్తుంద‌ని  ర్యాన్ వివరించారు.