తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి ప్రొఫెసర్ శ్రవణ్ దాసోజుకు అసెంబ్లీ టికెట్ కేటాయించారు. ఆయననను ప్రతిష్టాత్మకమయిన ఖైరతాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేయించనుంది కాంగ్రెస్. అయితే చివరి దాకా ఆయన టికెట్ మీద ఉత్కంఠ ఉండింది. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెంది ఉండటం, దానికి తోడు పెద్దగా జనాభా లేని హువుసుల కులానికి చెంది ఉండటం వల్ల ఆయనకు టికెట్ వస్తుందా రాదా అనే సస్పెన్స్ ఉండింది. రాజకీయ పార్టీలలో పెద్దగా దొరకని విజ్ఞానం, మంచి కంఠం, పరిశోధనాత్మక దృక్ఫధం, బోధనా వృత్తి అనుభవం దండిగా ఉన్న యువ నాయకుడు దాసోజు. అయితే, ఆయనకు రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోవడం వల్ల గతంలో టిఆర్ ఎస్ లో అవమానపడ్డారని చెబుతారు. పంచాయతీనుంచి పార్లమెంటు దాకా నియోజకవర్గాలన్నీ దాకా కుటుంబాల పాలన నడుస్తున్న ఈ రోజుల్లో పెద్ద చదవు, జ్ఞానము క్వాలిఫికేషన్లు కావు. రాజకీయ పార్టీలలో బతకాలంటే ఉన్నత కులం ఉండాలి. లేదా రాజకీయ అండ ఉండాలి. లేదా వెదజల్లెంత డబ్బుండాలి. ఇవి లేని దాసోజు టిఆర్ ఎస్ లో టికెట్ ఆశించి భంగపడ్డాడు. నీకులానికి ఓట్లే లేవు నువ్వు ఎలా గెలుస్తావని 2014 ఎన్నికలపుడు కెసిఆర్ దాసోజును అవమానపర్చారని, అందుకే ఆయన టిఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరాడని చెబుతారు. కాంగ్రెస్ లో కూడా ఆయనకు కులం సమస్య ఎదురయిందని అక్కడ కూడా ఇమడలేని పరిస్థితులొచ్చాయని అంటారు. అయితే, ఆయన మరొక పార్టీలోకి పోదల్చుకోలేదు. ఎపుడో ఒకసారి స్థానిక నేతలనుంచి కాకపోయినా ఢిల్లీ నుంచి గుర్తింపు వస్తుందనే ఆశతో ఆయన కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని నిజాయితీగా కష్టపడ్డారు. ఆశించినట్లే ఆయనను ఢిల్లీ గుర్తించింది. అనర్ఘళంగా తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మాట్లాడగలిగే వాడు పార్టీలో ఎవరూ లేరని, దాసోజు ఒక్కరే నని కాంగ్రెస్ అధిష్టానం భావించింది.
ఈ అభిప్రాయం రాష్ట్ర నాయకులు అంగీకరించక తప్పలేదు. టిఆర్ ఎస్ కు బలమయిన ప్రచార యంత్రాంగాన్ని తిప్పికొట్టేలా కాంగ్రెస్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు రూపొందించి ఇచ్చింది ఆయనే. ఇరిగేషన్ ప్రాజక్టుల మీద ఎంతోశోధించి టిఆర్ ఎస్ చెబుతున్నవన్నీ పేక్ అని చెప్పిందాయనే. ఇలా కాంగ్రెస్ నుంచి టిఆర్ ఎస్ కు ధీటైన కౌంటర్ ఇస్తూ వస్తున్నది దాసోజే. ఆయన టిఆర్ ఎస్ ను ఇరుకున పెట్టని రోజు లేదు. సాధారణంగా బిసిలు, దళిత నేతలు టిఆర్ ఎస్ మీద, ముఖ్యంగా కెసియార్, ఆయన కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేసేందుకు జంకుతారు. ఈ కులాలల్లో రాజకీయ భీతి ఎక్కువగా ఉంటుంది. దానిని అధిగమించి, ధీటైన భాషలో టిఆర్ఎస్ త్రయంకి (కెసియార్, హరీష్, కెటియార్) ధీటైన సమాధానం ఇవ్వడమే కాదు, సవాళ్లు, ప్రతిసవాళ్లు విసిరిన ఏకైక బిసి నాయకుడు దాసోజే. రాజకీయ సొల్లు కాకుండా కచ్చితమయిన ఆధారాలతో విమర్శలు చేసింది దాసోజే. అయినా సరే ఆయనకు పార్టీలో తగిన గుర్తింపు రాలేదు. కారణం చిన్నదే కులం. టిఆర్ఎస్ ను దొరల పార్టీ అని విమర్శించినా తెలంగాణ కాంగ్రెస్ కు కూడా సామాజిక వర్గ సమీకరణాలు ఉన్నాయి అదే దాసోజును చివరి దాకా టెన్షన్ లో పెట్టింది. అయినా సరే, ఆయనను గుర్తించక తప్పలేదు, బుధవారం నాడు విడుదల చేసిన రెండో జాబితాలో ఆయన పేరు చేర్చక తప్పలేదు.