Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాల్ టాంపరింగ్ వివాదం..క్రికెటర్లనే కాదు…వారి కుటుంబసభ్యులనూ తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. జరిగిన తప్పుకు వివాదంలో చిక్కుకున్న ముగ్గురు క్రికెటర్లూ తీవ్ర పశ్చాత్తాపానికి గురై మీడియా ముందు కంటతడి పెట్టారు. డేవిడ్ వార్నర్ అయితే భోరున విలపించాడు. ఈ ఘటనతో తన భార్యాపిల్లలు కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారని వార్నర్ వాపోయాడు. తాజాగా వార్నర్ భార్య కాండైస్ వార్నర్ కూడా మీడియా ముందు కన్నీటి పర్యంతమయింది. ఈ వివాదంలో తన తప్పు కూడా ఉందని, తనను తాను నిందించుకుంది.
దక్షిణాఫ్రికాలో తనపై వచ్చిన విమర్శల కారణంగానే ఇలా జరిగిందని ఆమె భావిస్తోంది. ఇది నా తప్పిదంగానే భావిస్తున్నా..ఇది నన్ను చంపేస్తోంది అని ఆవేదన చెందింది. బాల్ టాంపరింగ్ ఘటనకు ముందు టెస్ట్ సిరీస్ మొదటి టెస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఆటగాడు డికాక్ కు, వార్నర్ కు మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ గొడవకు కారణం వార్నర్ భార్య గురించి డికాక్ తప్పుగా మాట్లాడడం. కాండైస్ గురించి డికాక్ చేసిన వ్యాఖ్యలకు వార్నర్ కు కోపం వచ్చి..ఇద్దరి మధ్యా మాటల యుద్ధానికి దారితీసింది.
ఆ తర్వాత పలువురు దక్షిణాఫ్రికా అభిమానులు రగ్బీ ఆటగాడు సోనీ బిల్ విలియమ్స్ ఫేస్ మాస్క్ లు ధరించి మైదానంలో వార్నర్ ను రెచ్చగొట్టారని కాండైస్ తెలిపింది. దక్షిణాఫ్రికా అభిమానులు ఇలా చేయడానికి కారణం వార్నర్ ను కలవకముందు కాండైస్ కు సోనీ విలియమ్స్ తో ఎఫైర్ ఉండడమే. డికాక్ వ్యాఖ్యలు, దక్షిణాఫ్రికా అభిమానుల ప్రవర్తనతో చికాకు చెందిన వార్నర్ తనను తాను అదుపుచేసుకోలేక ఎలాగైనా విజయం సాధించాలని ఇలా చేసి ఉంటాడని ఆమె సిడ్నీ సండే టెలిగ్రాఫ్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వాపోయింది.
టాంపరింగ్ ఆరోపణలు వచ్చినరోజు తాను కూడా స్టేడియంలో ఉన్నానని గుర్తుచేసుకున్న కాండైస్, తన కళ్లముందు జరిగిన దృశ్యాలను, చూసిన ఘటనలను మర్చిపోలేకపోతున్నానని చెప్పింది. తనపై, తన కుటుంబంపై క్రీడాభిమానులు చేస్తున్న విమర్శలు తట్టుకోలేకపోతున్నానని, దక్షిణాఫ్రికాలో ఉన్నంతసేపూ నరకంలోనే ఉన్నట్టు అనిపించిందని ఆవేదన చెందింది. ఈ ఘటనలో తన భర్త పాత్ర లేదని తాననడం లేదని, ఆయన్ను క్షమించాలని కూడా అనడం లేదని, అయితే తమ పిల్లలను కూడా నిందించడం ఏ మేరకు భావ్యమని ప్రశ్నించింది.
ఇంటికి వచ్చిన తన భర్త బెడ్ రూమ్ లో కూర్చుని ఏడుస్తుంటే తన హృదయం బద్దలైందని బాధపడింది. వార్నర్ ఈ పతనాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాడని, అతని పట్ల సానుభూతి,సహనం చూపించాలని ఆస్ట్రేలియా అభిమానులను కాండైస్ కోరింది.