Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత్ తరపున టెస్ట్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్. తన కెరీర్లో రెండుసార్లు సెహ్వాగ్ ఈ ఘనత సాధించాడు. 2004లో ముల్తాన్ లో జరిగిన టెస్టులో పాకిస్థాన్ పై 309 పరుగులు చేసి.. ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయ క్రికెటర్ గా సెహ్వాగ్ రికార్డునెలకొల్పాడు. తర్వాత 2008లో చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై 319 పరుగులు చేసి మరో రికార్డు సాధించాడు. ఎనిమిదేళ్లపాటు ఈ రికార్డు సెహ్వాగ్ పైనే ఉంది.
2016లో మాత్రం మరో ఆటగాడు సెహ్వాగ్ సరసన చేరాడు. అతనే కరుణ్ నయ్యర్ . కరుణ్ కూడా…చెన్నైలోనే ఇంగ్లండ్ పై ట్రిపుల్ సెంచరీ చేశాడు. మొత్తంగా భారత్ తరపున ఇద్దరు ఆటగాళ్లు టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీలు నమోదుచేశారు. అయితే ఈ విషయంలో ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ పొరపాటుపడి నెటిజన్ల చేతిలో విమర్శలకు గురయింది. విషయమేంటంటే… ఫిరోజ్ షా కోట్ల మైదానంలోని రెండో ద్వారానికి వీరేంద్ర సెహ్వాగ్ పేరు పెట్టింది డీడీసీఏ. భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేసి సెహ్వాగ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది.
సెహ్వాగ్ తన కెరీర్ లో ఆడిన టెస్టులు, వన్డేల వివరాలు, సాధించిన రికార్డులు గురించి తెలియజేస్తూ స్టేడియంలో ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటుచేశారు. ఆ బోర్డులో పొందుపర్చిన వివరాల్లో ఓ చోట డీడీసీఏ పొరపాటు పడింది. భారత్ తరపున టెస్ట్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్ మెన్ సెహ్వాగ్ అని బోర్డులో పేర్కొన్నారు. సెహ్వాగ్ తరువాత ట్రిపుల్ సెంచరీ నమోదుచేసిన కరుణ్ నయ్యర్ విషయం డీడీసీఏ మర్చిపోయింది. ఇది గమనించిన నెటిజన్లు డీడీసీఏపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నిజానికి కరుణ్ నయ్యర్ రికార్డును డీడీసీఏ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కరుణ్ ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సభ్యుడిగా ఉన్నాడు. అయినా సరే సెహ్వాగ్ ను పొగిడే క్రమంలో కరుణ్ సంగతిని పక్కనబెట్టింది డీడీసీఏ. సెహ్వాగ్ ను గౌరవిస్తున్న సందర్భం కాబట్టి ఆయన గురించే చెప్పాలనుకుంటే..టెస్టుల్లో రెండు సార్లు ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత క్రికెటర్ అని బోర్డులో పేర్కొంటే వివాదం ఉండేది కాదు.