ఘోర ప్రమాదం…పదమూడు మంది మృతి

Deadly accident ... Thirteen killed

మహారాష్ట్రలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మహారాష్ట్ర ఆర్టీసీకి చెందిన బస్సును భారీ కంటెయినర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ధూలే జిల్లా నీమ్గల్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఔరంగాబాద్ నుంచి 45 మంది ప్రయాణికులతో వస్తున్న మహారాష్ట్ర ఆర్టీసీ బస్సును నీమ్గల్ వద్ద ఎదురుగా వస్తున్న ట్రక్ ని బలంగా ఢీకొట్టడంతో 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదం గురించి తెలిసిన స్థానికులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. క్షతగాత్రులను వైద్యం కోసం సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ప్రయివేట్ హాస్పిటల్‌లో చేర్పించారు.

మృతదేహాలను పోస్టుమార్టం కోసం ధూలే జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. వేగంగా వాహనాలు నడిపి ఎదురుగా వస్తున్న వాటిని గమనించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతుల్లో రెండు వాహనాల డ్రైవర్లు ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు, గాయపడిన వారిలో మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. బాధితుల వివరాలు గురించి తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.