లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ…

Debate on Women's Reservation Bill in Lok Sabha
Debate on Women's Reservation Bill in Lok Sabha

మహిళా రిజర్వేషన్ల బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలు ఈ బిల్లుపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంటుతో పాటు అసెంబ్లీలోనూ మహిళలకు రిజర్వేషన్లు వర్తిస్తాయని ఎంపీ మేఘవాలే అన్నారు. మహిళా రిజర్వేషన్‌ చట్టంతో మహిళా సాధికారత సాధ్యమవుతుందని తెలిపారు. పదిహేనేళ్ల పాటు మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమల్లో ఉంటుందని మేఘవాలే వెల్లడించారు.

మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు ఇస్తామని సోనియా తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఈ బిల్లును సమర్థిస్తోందని.. ఈ బిల్లును తీసుకురావడంతో రాజీవ్‌గాంధీ స్వప్నం నెరవేరిందని వెల్లడించారు. రాజీవ్‌గాంధీ స్థానికసంస్థల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించారని.. ఈ బిల్లును తక్షణమే అమల్లోకి తీసుకురావాలని .. ఆలస్యమైతే మహిళలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. కోటాలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు సబ్‌ కోటా కల్పించాలని.. చట్టం సమర్థ అమలుకు తక్షణమే కులగణన చేపట్టాలని సోనియాగాంధీ కోరారు.