Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దీపక్ రెడ్డి భూ అక్రమాల చిట్టా బయటికి వచ్చే కొద్దీ ఆయనతో ఎంతో కాలంగా పరిచయం వున్న వాళ్ళు సైతం ఆశ్చర్యపోతున్నారు. 2012 లో రాయదుర్గం ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నిలబడ్డప్పుడు ఆయన ఎన్నికల సంఘానికి దాఖలు చేసిన పిటీషన్ లో ఏకంగా 6 వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు డిక్లరేషన్ ఇచ్చారు. అప్పట్లో ఇది ఓ దేశవ్యాప్త సంచలనం. ఆయనకి ఏదో ఆఫ్రికన్ దేశంలో గనులు ఉన్నాయని అప్పట్లో బహుళ ప్రచారం జరిగింది. గెలుపు మాత్రం దక్కలేదు. అయితే ప్రచారానికి తగినట్టు ఖర్చు పెట్టలేదని దీపక్ రెడ్డి మీద విమర్శలు వచ్చాయి. జేసీ బ్రదర్స్ మేనల్లుడు కాబట్టే దీపక్ రెడ్డి కి రాయదుర్గం సీట్ దక్కిందని అంతా అనుకున్నారు. కానీ నిజానికి దీపక్ రెడ్డి గురించి లోతుల్లోకి వెళితే ఆసక్తికర అంశాలు తెలిసాయి.
నిజానికి దీపక్ రెడ్డి మూలాలు నెల్లూరు జిల్లాలో వున్నాయి. ఆయన తండ్రి పద్మనాభ రెడ్డి నెల్లూరు జిల్లాకి చెందిన కాంట్రాక్టర్ అట. ఆయన తాత కూడా కాంట్రాక్టర్. ఆర్ధికంగా బలమైన వారు కూడా. ఓ ప్రముఖ వ్యాపారవేత్త కం రాజకీయ నాయకుడు టి.సుబ్బిరామిరెడ్డి లాంటి వాళ్లకి అప్పట్లో దీపక్ రెడ్డి తాత ఆర్ధిక సహకారం అందించేవారని టాక్. ఆపై దీపక్ రెడ్డి తండ్రి పద్మనాభ రెడ్డి కూడా కాంట్రాక్ట్స్ చేసినా పెద్దగా కలిసిరాలేదట. ఆ పరిచయాలతో ఓ ప్రముఖ వ్యాపారవేత్త కం రాజకీయనాయకుడు టి.సుబ్బిరామిరెడ్డి కొంతకాలం దీపక్ రెడ్డి కి ఉద్యోగం కూడా కల్పించి పెద్ద జీతమే ఇచ్చారట. ఆ తర్వాత కొద్దికొద్దిగా ఎదిగిన దీపక్ రెడ్డి జేసీ ఇంటి అల్లుడు కావడంతో సీన్ మారిపోయింది. దీపక్ రెడ్డి కొద్ది కాలంలోనే ఆర్ధికంగా నిలబడ్డారు. ఇప్పుడు భూ కుంభకోణంలో ఇరుక్కుని జైలుకెళ్లారు.