పద్మావతి కోసం దీపిక ధైర్యంగా పోరాడుతోంది
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పద్మావతిని చుట్టుముడుతున్న వివాదాలు అంతర్జాతీయంగా సైతం చర్చనీయాంశమవుతున్నాయి. పద్మావతిలో రాజ్ పుత్ ల గౌరవాన్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ…రాజ్ పుత్ కర్ణిసేన ఉత్తరభారతదేశంలో ఆందోళనలు నిర్వహిస్తోంది. సినిమా విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది. కర్ణిసేన వ్యవహార శైలిని పద్మావతి హీరోయిన్ దీపిక పదుకునే తవ్రంగా వ్యతిరేకిస్తోంది. వారిపై తరచూ విమర్శలు చేస్తోంది. దీంతో కర్ణిసేన దీపికకు హెచ్చరికలు జారీచేసింది. దీపిక ముక్కు కోస్తామని, ఆమెను చంపివేస్తామని హెచ్చరిస్తోంది. అయితే దీపిక మాత్రం ఈ బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
పద్మావతిపై వివాదాలు సృష్టించడాన్ని తప్పుపడుతోంది. దీపిక ఇలా ప్రాణాలను లక్ష్యపెట్టకుండా…సినిమా కోసం పోరాడడాన్ని బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. దేశవ్యాప్తంగానూ దీపిక ధైర్యసాహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు. అలాగే అంతర్జాతీయంగానూ ఆమెకు మద్దతు లభిస్తోంది. పద్మావతి వివాదం గురించి తెలుసుకుని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని హాలీవుడ్ నటి రూబీ రోస్ ట్వీట్ చేసింది. దీపిక హాలీవుడ్ లో నటించిన ట్రిపుల్ ఎక్స్ః రిటర్న్స్ ఆఫ్ క్జాండర్ కేజ్ లో రూబీ రోస్ కూడా నటించింది. ఈ సినిమా సమయంలో వారిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. తన స్నేహితురాలి విషయంలో జరుగుతున్న పరిణామాల గురించి తెలుసుకున్నానని, ఆమె చేస్తున్న పోరాటానికి హ్యాట్సాఫ్ అని రూబీ రోస్ ట్వీట్ చేసింది. తనకు తెలిసిన ధైర్యవంతమైన మహిళల్లో దీపిక ఒకరని రూబీ ప్రశంసించింది.