దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ కరోనా తీవ్రత వీరలెవల్లో విజృంభిస్తోంది. అసలు దేశంలో కరోనా స్థాయి ఏవిధంగా ఉంది అనడానికి ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. మాజీ ఎంపీ, ప్రముఖ జర్నలిస్ట్ షాహిద్ సిద్దిఖీ మేనకోడలు సరైన సమయానికి వెంటిలేటర్ లభించక పోవడంతో మృత్యువాత పడింది. ఈ ఘటన దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మకమైన ఆసుపత్రుల్లో ఒకటైన సఫ్దర్ జంగ్ హాస్పిటల్ లో జరగడం షాక్ కి గురిచేస్తుంది. అయితే ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన షాహిద్, ఆసుపత్రిలో రోగులను తీవ్ర నిర్లక్ష్యంగా చూస్తున్నారని ఆరోపించారు. అలాగే.. అక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని.. ఎంతో మంది చనిపోతున్నారని అసలు జనాలు ఎటు పోతున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది తెలిపారు.
అంతేకాకుండా అనారోగ్యంతో బాధపడుతున్న తన మేనకోడలు ముమ్మన్ కు అత్యవసర సేవకోసం ఐసీయూలోకి తీసుకెళ్లలేదని.. సమయానికి వెంటిలేటర్ పెట్టలేదని ఆయన తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు. ప్రజల ప్రాణాలను రక్షించడానికి కృషి చేయాల్సిన ఆసుపత్రులు, దాన్ని పక్కన పెట్టాయని.. ఢిల్లీ ప్రజల విషయంలో తనకు ఇప్పుడు చాలా బాధ కలుగుతోందని స్పష్టం చేశారు. కాగా రాజకీయాలను కాసేపు పక్కనపెట్టి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వివరించారు.