Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ లో బొటాబొటీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన బీజేపీకి ఆదిలోనే ఇబ్బందులు తలెత్తాయి. డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నితిన్ పటేల్ ఇంతవరకూ మంత్రిపదవి బాధ్యతలు మాత్రం స్వీకరించలేదు. సచివాలయం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. గతంలో తాను నిర్వహించిన కీలకశాఖలు ఇప్పుడు దక్కకపోవడమే ఆయన అలకకు కారణం. గత ప్రభుత్వంతో నితిన్ పటేల్ ఆర్థిక, పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖలు నిర్వహించారు. ఇప్పడు ఆయనకు ఆ ప్రాధాన్య శాఖలు కేటాయించకుండా… రోడ్లు, భవనాలు, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం, నర్మదా-కల్పసర్ ప్రాజెక్టు శాఖలను అప్పగించారు. నితిన్ నిర్వహించిన ఆర్థిక శాఖను ఆయన జూనియర్ సౌరభ్ పటేల్ కు అప్పగించడం కూడా ఉప ముఖ్యమంత్రి ఆగ్రహానికి కారణం. పెట్రోలియం, పట్టణాభివృద్ధి శాఖను సీఎం రూపానీ తన వద్దే పెట్టుకున్నారు.
శాఖల కోతను అవమానంగా భావిస్తోన్న నితిన్ బాధ్యతలు స్వీకరించేందుకు విముఖంగా ఉన్నారు. దీనిపై నితిన్ ఇప్పటిదాకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ… ఆయన అవమానభారంతో రగిలిపోతున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇది తమ నాయకుడి ఆత్మగౌరవ సమస్య అని, అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టంచేశాయి. అటు పాతశాఖలను తిరిగి కేటాయిస్తేనే బాధ్యతలు స్వీకరిస్తానని నితిన్ బీజేపీ అధిష్టానానికి తేల్చిచెప్పనట్టు సమాచారం. నిజానికి 2016 ఆగస్టులో ఆనందిబెన్ పటేల్ రాజీనామా అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి రేసులో నితిన్ పటేల్ పేరే ప్రముఖంగా వినిపించింది. ఒక దశలో ఆయన పేరు ఖరారయినట్టే ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో విజయ్ రూపానీకి ముఖ్యమంత్రి పదవి దక్కింది. అయితే డిప్యూటీ హోదాతో పాటు కీలక శాఖలు కేటాయించడంతో అప్పుడు నితిన్ మౌనంగా ఉండిపోయారు. ఇప్పడు శాఖల్లో కోతపడడంతో తిరుగుబావుటాకు సిద్ధపడ్డారు.