అరవ పాఠం మోడీకి అర్ధం కాలేదు…

Vijay Sai Reddy meets to PM Modi

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జయ మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలు కుక్కలు చింపిన విస్తరిలా తయారు అయ్యాయి. ఇక బలమైన నాయకురాలు లేని పరిస్థితిని అడ్డం పెట్టుకుని కేంద్రం అక్కడ ఆడింది ఆట పాడింది పాటగా చెలాయించాలని చూసింది. భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డ శశికళ అండ్ టీం కేంద్రం పురమాయించి ఐటీ దాడులతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఇక బీజేపీ చెప్పినట్టల్లా తలాడించి పళనిస్వామి, పన్నీర్ సెల్వం పదవులు కాపాడుకున్నారు గానీ తమ గౌరవం పోగొట్టుకోవడమే కాకుండా తమిళ ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బ తీశారు. వాళ్ళు అంత దిగాజారినా ఫలితం ఉండబోదని భావించిన ప్రధాని మోడీ కన్ను డీఎంకే మీద పడింది. ఇంటికెళ్లి మరీ కరుణని పరామర్శించి ఢిల్లీ వచ్చి మా ఇంట్లో రెస్ట్ తీసుకోమన్నారు. ఈ బంధానికి స్టాంప్ వేసినట్టు 2 జి కేసు తీర్పు వచ్చిందని తమిళ ప్రజలు అర్ధం చేసుకున్నారు. దీంతో తమిళ పురచ్చితలైవి జయ మరణం దగ్గర నుంచి చేసిన తప్పులు అన్నిటికీ ఒక్కటే పాఠం, గుణపాఠంలా ఆర్కే నగర్ తీర్పు వచ్చింది. మోడీ ముందు వెనకేసుకొచ్చిన ఒపీయస్, ఈపీఎస్ లకు షాక్, ఇప్పుడు చేతులు కలుపుతున్న డీఎంకే కి అంత కంటే పెద్ద షాక్ ఇచ్చాడు అరవ ఓటరు. ఇక నోటా కన్నా తక్కువ ఓట్లతో అక్కడ బీజేపీ కి జరిగిన పరాభవం గురించి చెప్పనే అక్కర్లేదు.

అరవ ప్రజలు అంత స్పష్టమైన పాఠం చెప్పాక కక్ష సాధింపు రాజకీయాలు పనిచేయవని, అవినీతి పరులకు కొమ్ము కాస్తే జనం సహించబోరని అర్ధం చేసుకోవాలి. అయినా ఆ పాఠం మోడీ, అమిత్ షా జోడీకి అర్ధం కానట్టుంది. అందుకే పీకల్లోతు కేసుల్లో ఇరుక్కున్న జగన్ కి ఆనాడు అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడు జగన్ అవినీతికేసులకు వెన్నుముక లాంటి విజయసాయిరెడ్డి తో భేటీ అయ్యారు. నిజంగా ఈ భేటీ ఓ ప్రధాని తో ప్రజా సమస్యల మీద ఎంపీ జరిపిందే అయితే నష్టం లేదు. లేక రాజకీయ కోణంలో గనుక ఇలాంటి చర్చలు జరుపుతుంటే మాత్రం అవినీతిపరుల కొమ్ము కాసినందుకు 2019 లో జనం ఆగ్రహం ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. ఇప్పటికీ ఏపీ కి ఇచ్చిన విభజన హామీలు తుంగలో తొక్కి ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో ఇంకో కాంగ్రెస్ అన్న బిరుదు పొందారు. ఇప్పుడు జగన్ తో జట్టు కడితే ఏపీ జనం అనుకున్నదే నిజం అవుతుంది. అయినా అరవ ఓటరు అరటి పండు వలిచిపెట్టినట్టు పాఠం చెప్పినా అర్ధం చేసుకోవడంలో మోడీ అండ్ కో ఎందుకు తడపడుతోందో ?