మరోసారి ట్రైనింగ్‌ తీసుకునేందుకు సిద్ధమవుతున్న దేవరకొండ

మరోసారి ట్రైనింగ్‌ తీసుకునేందుకు సిద్ధమవుతున్న దేవరకొండ

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా తొలి విజయ్‌ అందుకున్న ఈ యంగ్‌ హీరో తరువాత అర్జున్‌ రెడ్డితో జాతీయ స్థాయిలో హాట్‌ టాపిక్‌గా మారాడు. ఈ సినిమాలో విజయ్‌ యాటిట్యూడ్‌ యూత్‌కు బాగా ఎక్కేసింది. యంగ్‌ జనరేషన్‌ హీరోల్లో క్రేజీ స్టార్‌గా మారిపోయాడు.తన అభిమానులను రౌడీస్‌ అంటూ పలకరిస్తూ వారికి మరింత చేరువయ్యాడు. తరువాత చేసిన గీత గోవిందం కూడా భారీ సక్సెస్‌ కావటంతో విజయ్‌ దేవరకొండ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ గీతగోవిందం తరువాత మరోసారి అదే మ్యాజిక్‌ రిపీట్ చేయటంలో ఈ రౌడీబాయ్‌ ఫెయిల్‌ అవుతున్నాడు. గీత గోవిందం తరువాత విజయ్‌ బైలింగ్యువల్‌ మూవీ నోటా ఫెయిల్ కాగా టాక్సీవాలా సో సోగా ఆడింది

ఇటీవల విడుదలైన డియర్ కామ్రేడ్‌.. విజయ్‌ దేవరకొండ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. విజయ్‌ కెరీర్‌లో క్లాసిక్‌గా నిలిచిపోతుందని ఆశించిన సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తాపడింది. దీంతో విజయ్‌ దేవరకొండ ఆలోచనలో పడ్డాడు. తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.ప్రస్తుతం క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న వరల్డ్‌ ఫేమస్‌ లవర్ సినిమాలో నటిస్తున్నాడు విజయ్‌. ఈ సినిమాతో పాటు తమిళ దర్శకుడు తిరు తెరకెక్కిస్తున్న యాక్షన్‌ మూవీ హీరోలోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్‌ బైక్‌ రేసర్‌గా కనిపించనున్నాడు. ప్రొఫెషనల్ రేసర్‌గా కనిపించేందుకు ట్రైనింగ్‌ కూడా తీసుకున్నాడు అర్జున్‌ రెడ్డి.

తాజాగా మరో సినిమా కోసం కూడా విజయ్‌ ట్రైనింగ్‌ తీసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల ఇస్మార్ట్‌ శంకర్‌తో తిరిగి ఫాంలోకి వచ్చిన టాలీవుడ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ తన తదుపరి చిత్రాన్ని విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకు ఫైటర్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి.అయితే ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ మరోసారి ట్రైనింగ్‌ తీసుకునేందుకు సిద్ధమవుతున్నాడట. మార్షల్ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నాడట. దాదాపు రెండు నెలల పాటు ఈ శిక్షణలో పాల్గొననున్నాడు విజయ్‌ దేవరకొండ. అందుకోసం ప్రత్యేకంగా ఓ ట్రైనర్‌ను కూడా నియమించారు.