తెలంగాణాలో టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న భ్రమలు ఎవరికీ లేవు. రేవంత్ పార్టీని వదిలి కాంగ్రెస్ లో చేరాక అధికారం మాట దేవుడు ఎరుగు అసలు ఉత్సాహమే లేకుండా పోయింది పార్టీ శ్రేణుల్లో. ఇక మోత్కుపల్లి కూడా పార్టీకి దూరం అయ్యాక మిగిలిన ఆశలు కూడా ఆవిరి అయ్యాయి. దీంతో తెలంగాణాలో టీడీపీ బాధ్యత తీసుకుని శ్రేణుల్లో ఉత్సాహం తెచ్చే నాయకుడే కరువు అయ్యాడు. కానీ… కర్ణాటక పరిణామాలతో కొందరు నేతల్లో ఎక్కడో మిణుకుమిణుకు మంటున్న ఆశలు బయటకు వస్తున్నాయి. అలాగే కొన్నేళ్లుగా అనారోగ్యంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న టీడీపీ సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ ఇప్పుడు రంగంలోకి వచ్చారు.
టీడీపీ కి గుడ్ బై కొడతారని ఈమధ్య దేవేందర్ గౌడ్ గురించి కూడా ఇబ్బడిముబ్బడిగా పుకార్లు పుడుతున్నాయి. అయితే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు ఆయనే చొరవ చూపారు. తాను టీడీపీ ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పిన దేవేందర్ గౌడ్, తెరాస పాలన మీద కూడా విమర్శలు గుప్పించారు. మున్ముందు తాను రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. ఆయన అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం ఇందుకు ఓ కారణం అయితే కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం ఏర్పడడం ఇంకో కారణం అని తెలుస్తోంది. కుమారస్వామి సీఎం అయిన తీరు చూసాక తెలంగాణాలో కష్టపడితే టీడీపీ ని బతికించవచ్చని దేవేందర్ గౌడ్ భావిస్తున్నారట. ఒకప్పుడు టీడీపీ లో నెంబర్ టూ గా వెలిగిన దేవేందర్ గౌడ్ అప్పట్లో అసెంబ్లీ లో వై.ఎస్ లాంటి నేతని బలంగా ఢీకొట్టిన సందర్భాలు చూసాం. ఇప్పుడు ఆయన స్వయంగా టీడీపీ కి పునరుత్తేజం కల్పించే బాధ్యత తీసుకుంటే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో చెప్పుకోదగ్గ మార్పులు వస్తాయి.