ఏపీ టిడిపి రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి దేవినేని ఉమా ప్రతిపక్ష నేత జగన్ ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్ నోరు తెరిస్తే అబద్ధమని, ఆకాశం మీద వుమ్మి వేస్తే మన మీదే పడుతుందని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ పూర్తిగా విఫలమైందని, జగన్ తాను సీఎం అవుతాననే భ్రమలోనే ఇంకా ఉన్నారని విమర్శించారు. తాను సీఎం అయ్యాక పోలవరం పూర్తి చేస్తానని జగన్ వ్యాఖ్యానించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. పోలవరం పనులు ఇప్పటికే 58 శాతం పూర్తయ్యాయని తెలిపారు. జగన్‌కు రాష్ట్రంలో అసలేం జరుగుతుందో తెలియదని ఓసారి పోలవరం వెళ్లి ప్రాజెక్టు పనులను చూసి రావాలని సూచించారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారని విమర్శించారు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. జగన్ ఇక తన దుకాణం మూసేసి.. వైసీపీకి టూ లెట్ బోర్డు పెట్టుకునే సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థులకు టికెట్లు అమ్ముతున్నారని ఆరోపించారు. చిలకలూరిపేట, మైలవరం టికెట్‌లను ఇప్పటికే అమ్మేశారని ఆరోపించారు. తుని, పెద్దాపురం, అన్నవరం ప్రాంతాల్లో బ్రహ్మాండంగా పంటలు వేశారని ఇంకా కొత్త గా 12 ప్రాజెక్టు లు తీసుకురానున్నామని ఆయన చెప్పుకొచ్చారు. గోదావరి పెన్నా అనుసంధానానికి శంఖుస్థాపన చేయనున్నామని, నువ్వు ఎన్ని రాళ్లు వేసినా, శాపనార్థాలు పెట్టిన వర్షాలు చక్కగా పడ్డాయని జగన్ కు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రం సస్యశ్యామలంగా వుందని సాగర్ లో, శ్రీశైలం లో, పులిచింతల ప్రాజెక్టు లు పూర్తి స్థాయిలో నిండనున్నాయని ఆయన పేర్కొన్నారు. అధికారుల హెచ్చరికలు ప్రజలు పాటించి అప్రమత్తంగా ఉండాలని ఇంత జరుగుతున్నా జగన్ ఏడుపులు, శోకాలు ఆపడం లేదని అన్నారు.