Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భోగాభాగ్యాలు కలగాలని కోరుకుంటూ ఓ పక్క భోగిపండుగ జరుపుకుంటూనే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆంజనేయస్వామి గుడికి పరుగులు తీస్తున్నారు. మామూలుగా పండుగవేళల్లో కొత్త దుస్తులు వేసుకుని భక్తులు ఆలయాలకు వెళ్లి సంప్రదాయ పూజలు చేయడం ఎప్పుడూ జరిగేదే. ఇష్టదైవం ఆలయానికో, లేదంటే దగ్గరలో ఉన్న గుడికో వెళ్లి పర్వదినాన దేవుణ్ని దర్శించుకుని కోరికలు తీరాలని ఆ భగవంతునికి విన్నవించుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రత్యేకించి హనుమంతుని గుడికే వెళ్తున్నారు భక్తులు. దీనికి కారణం సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారమే.
ఈ సంక్రాంతి పండుగ కీడు తేనున్నదని, ఎలాంటి నష్టమూ జరగకుండా ఆ కీడు పోవాలంటే ఇంట్లోని చిన్నారులతో ఆంజనేయస్వామి గుడిలో ప్రదక్షిణలు చేయించాలని తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు పిల్లలను తీసుకుని ఆంజనేయస్వామి గుడులకు తరలివెళ్తున్నారు. ఈ ప్రచారం ఎలా ప్రారంభమైందో తెలియదు కానీ… దీని వల్ల ఉదయం నుంచి హనుమంతుని గుడులు కిటకిటలాడుతున్నాయి. కీడు జరుగుతుందన్న మాట నిజమైనా, అబద్దమైనా ఓసారి గుడికి వెళ్లి ప్రదక్షిణ చేసి వస్తే పోయేదేముందన్న భావనతో భక్తులు ఆలయాలకు వెళ్తున్నారు. చిన్నారులతో గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి కీడు జరగకూడదని వేడుకుంటున్నారు.