డయాబెటిస్ బాధితులు వేపుళ్లు తినకూడదు

డయాబెటిస్ బాధితులు వేపుళ్లు తినకూడదు

కూరగాయలు కొంటున్నామంటే అందులో తప్పకుండా బెండ కాయలు ఉండాల్సిందే. ప్రపంచంలో ప్రతి ఒక్కరు బెండకాయలను ఆహారంగా తీసుకోడానికి ఇష్టపడతారు. పిల్లలు బెండకాయలు తినేందుకు మారం చేసినా.. లెక్కలు బాగా వస్తాయని చెప్పి మరీ పెద్దవాళ్లు బలవంతంగా తినిపిస్తుంటారనే సంగతి తెలిసిందే. బెండకాయను ఇంగ్లీషులో ‘ఓక్రా’ (Okra) లేదా లేడీ ఫింగర్ (Lady Finger) అని అంటారు. బెండకాయలను వయస్సు, వ్యాధులతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తినొచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. మరి, దీన్ని డయాబెటిస్ (మధుమేహం) బాధితులు తినొచ్చా? ఒక వేళ తింటే ఏ విధంగా తీసుకోవాలి? బెండకాయల వల్ల కలిగే ప్రయోజనాలేమిటీ? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

టర్కీతోపాటు తూర్పు మధ్యధరా ప్రజలు.. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించేందుకు ఆహారంగా తీసుకుంటారు. సాధారణంగా బెండకాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్లు, మినరల్స్, ఫైబర్‌తోపాటు తక్కువ క్యాలరీలు కలిగిన కూరగాయ ఇది. డయాబెటిస్ బాధితుల్లో ఏర్పడే జీవక్రియ సమస్యలు అంత సులభంగా నయం కావు. అయితే, మంచి జీవనశైలి అలవాట్లతో బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రణలో పెట్టుకోవడం ద్వారా డయాబెటిస్‌ను అదుపులో ఉంచవచ్చు. సమతుల్య ఆహారం, వ్యాయామం, తగిన విశ్రాంతి ద్వారా డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు. శరీరంలో బ్లడ్ షుగర్స్ అదుపులో ఉంటేనే అవయవాలు కూడా దెబ్బతినకుండా సక్రమంగా పనిచేస్తాయి. ఇందుకు బెండకాయ చక్కగా పనిచేస్తుంది.

బెండకాయ తొక్క, గింజలను బ్లడ్ షుగర్స్‌ను కంట్రోల్ చేసే ఇన్ఫ్యూషన్‌గా ఉపయోగిస్తారు. వాటిని ఎండలో ఆరబెట్టి, పిండిలా చేసి ఆహారంతో కలిపి తీసుకోవాలని సూచిస్తారు. ఇప్పటివరకు జరిపిన అనేక అధ్యయనాలు, పరిశోధనల ప్రకారం.. బెండకాయలు షుగర్ స్థాయిలను నియంత్రించడంలో చక్కగా పనిచేస్తోందని తేలింది. బెండకాయలో పూర్తిగా కరగని, కరిగే ఫైబర్ ఉంటుంది. బ్లడ్ షుగర్స్‌ను అదుపులో ఉంచుతుందది. ఆహారం ద్వారా శరీరానికి అందే కార్బోహైడ్రైట్లను గ్రహించే ప్రక్రియను అది నెమ్మదిగా జరిగేలా చూస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ కూడా నెమ్మదిగా సాగుతుంది. ఫలితంగా శరీరంలో ఒకేసారి బ్లడ్ షుగర్ స్థాయిలు పెరగవు.

బెండకాయలో ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి షుగర్ నియంత్రణకు చక్కగా పనిచేస్తాయి. వీటిలో ముఖ్యమైన సమ్మేళనం.. మైరిసెటిన్. ఇది కేవలం శరీరంలో బ్లడ్ షుగర్స్‌ను నియంత్రించడమే కాకుండా క్యాన్సర్, గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలు రాకుండా శరీరానికి రక్షణ కల్పిస్తుంది. బెండకాయలో ఉండే ఒలియానోలిక్ ఆమ్లం, బీటా సిస్టోస్టెనాల్, కెంప్ఫెరోల్ సమ్మేళనాలు సైతం డయాబెటిస్‌ను కంట్రోల్ చేసేందుకు పనిచేస్తాయి.

తాజా అధ్యయనాల ప్రకారం.. వారంలో కనీసం మూడు సార్లు బెండకాయను ఆహారంగా తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను నియంత్రించవచ్చని కనుగొన్నారు. బెండకాయలను ఎండబెట్టి కూడా ఉపయోగించవచ్చు. బెండకాయ నీళ్లు కూడా శరీరానికి మేలు చేస్తాయి. దీన్ని సూపర్ డ్రింక్ అని కూడా అంటారు. పూర్వికులు బెండకాయ నీటిని ఆచారాల్లో భాగంగా ఉపయోగించేవారు. ఇందులో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పలు పరిశోధనలు తేల్చి చెప్పడంతో ప్రజలు బెండకాయ నీటిని తాగడాన్ని అలవాటు చేసుకున్నారు.

మూడు నుంచి ఐదు బెండకాయలు తీసుకోండి. వాటి పైభాగం, చివరి భాగాన్ని కట్ చేసి.. పై నుంచి కిందకు నిలువుగా చీల్చండి. రెండు గ్లాసుల నీటిలో వాటిని పెట్టి రాత్రంతా నానబెట్టండి. ఉదయం వాటిని నీటిలో గట్టిగా పిండేసి జిగురు మొత్తం కలిసేలా నీటిని కలిపేసి తాగేయండి. ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవట. అయితే, మీకు బెండకాయలంలే అలర్జీ ఉన్నా, కొన్ని ఆహారాలు మీ శరీరానికి పడకపోయినా జాగ్రత్తలు తీసుకోవాలి.

మీకు ఇతరాత్ర అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే తప్పకుండా వైద్యుడి సలహా తీసుకున్న తర్వాతే ఈ చిట్కా పాటించాలి. ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ (Irritable bowel syndrome) అనే పేగు సమస్యలు ఉన్నట్లయితే.. బెండకాయలకు దూరం ఉండటం మంచిది. ఇందులో ఉండే ఫ్రక్టోన్ సమస్యను మరింత తీవ్ర చేసే అవకాశం ఉంది. ఈ సమస్య ఉన్నవారు పచ్చి కూరగాయలకు బదులు ఉడికించిన లేదా వండిన కూరగాయాలు తినడం ఉత్తమం.

చాలామందికి బెండకాయను నూనెలో వేయించుకుని ఫ్రైలా తినడం ఇష్టం. కానీ, డయాబెటిస్ బాధితులు అస్సలు వేపుళ్లు తినకూడదు. వీలైతే తక్కువ నూనె వేసుకుని వేయించుకుని తినండి. మీకు కరకరలాడే బెండకాయలను తినాలపిస్తే ముక్కలు చేసి ఎండలో పెట్టిన తర్వాత తక్కువ నూనెతో వేయిస్తే చాలు. ఒక వేళ మీ ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉంటే పని మరింత సులభం అవుతుంది. డయాబెటిస్ బాధితులు ఏదైనా డైట్ పాటించేప్పుడు తప్పకుండా వైద్యుడి సలహా తీసుకోవాలి. లేకపోతే మీ డైట్ వైద్యులు రాసిచ్చే మందులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.