కన్నడ ముద్దుగుమ్మ రష్మిక ‘గీతాగోవిందం’ సినిమాతో టాలీవుడ్లో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఈ సినిమా సూపర్‌హిట్ అవ్వడంతో రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె దేవదాస్, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఆమె చేతిలో పలు తెలుగు చిత్రాలు ఉన్నాయి.
‘గీతా గోవిందం’ సక్సెస్ తర్వాత రష్మిక తన రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిందట. ఈ క్రమంలో నాగ చైతన్య హీరోగా తాను నిర్మించబోతున్న చిత్రంలో రష్మికను హీరోయిన్గా ఖరారు చేయాలని దిల్ రాజు భావించారట. అయితే, ఆమె భారీ మొత్తంలో డిమాండ్ చేయడంతో బిత్తరపోయిన దిల్‌రాజు.. అంతమొత్తంలో ఇవ్వడం కుదరదంటూ తేల్చి చెప్పారట. దీంతో ఆమె ఈ ఆఫర్‌ను వదులుకున్నారని టాక్.
రెమ్యూనరేషన్ కారణంగా తన సినిమా నుంచి రష్మిక తప్పుకోవడం దిల్ రాజుకు కోపం తెప్పించిందని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో కొత్త దర్శకుడు శశి తీయబోయే చిత్రంలోనూ రష్మికను తీసేసి.. మరో హీరోయిన్ను పెట్టుకోవాలని ఆయన నిర్ణయించారని ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. ‘నూతన దర్శకుడు శశి డైరెక్షన్లో దిల్‌రాజు ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం రష్మికను అనుకున్నారు. దర్శకుడు ఇప్పటికే రెండుసార్లు రష్మికకు కథ వినిపించారు. అయితే, మరోసారి కథ వినాలని ఆమె కోరింది. ఈ క్రమంలో ఆమెను తీసుకోకూడదని దిల్ రాజు నిర్ణయించారు’ అని ఆ వర్గాలు చెప్పుకొచ్చాయి.
రష్మిక తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచడంతో పలు ఆఫర్లు వదులుకోవాల్సి వచ్చిందని ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. నాని హీరోగా తెరకెక్కిన తెలుగు సూపర్‌హిట్ ‘జెర్సీ’ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో షాహిద్ కపూర్ సరసన రష్మికకు చాన్స్ వచ్చినా… ఆమె రెమ్యూనరేషన్‌తో షాక్ తిన్న నిర్మాతలు మరో హీరోయిన్ వెతుక్కొనే పనిలో పడ్డారని కథనాలు వస్తున్నాయి. ఏదీఏమైనా.. ‘గీతాగోవిందం’ తర్వాత రష్మికకు సరైన హిట్ లేదు. ఈ నేపథ్యంలో మరో సూపర్ హిట్ వస్తే తప్ప రష్మికకే ఇండస్ట్రీలో క్రేజ్ పెరగడం కష్టమేనని సినీ జనాలు అంటున్నారు.