Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ దర్శకుడు అజయ్ కౌండిన్య తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన సినిమా బూత్ బంగ్లా కు సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగాలకు చెందిన నలుగురు వ్యక్తులపై అభ్యంతర కర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను తీసిన సినిమాలు థియేటర్లు దొరకక, విడుదలకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తంచేసిన ఆయన ఈ సందర్భంగా తాను నలుగురు గురించి మాట్లాడతానన్నారు. అజయ్ కౌండిన్య తీవ్ర విమర్శలు చేసిన వారిలో వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా మొదటి వ్యక్తి. సీనియర్ నటి, ఎమ్మెల్యే అయిన రోజాకు పాదాభివందనం అన్న కౌండిన్య ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్య గురించి మాట్లాడే రోజా… సినిమా పరిశ్రమలోని సమస్యల గురించి మాత్రం మాట్లాడదని మండిపడ్డారు. ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు, టెక్నీషియన్లు ఇలా ఎందరో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నా ఆమె ఏమీ చేయడం లేదని విమర్శించారు. రామ్ గోపాల్ వర్మ విదేశీ నటిని పెట్టి సినిమా తీశారని, రోజాను పెట్టి తీసుంటే బాగుండేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా ఒప్పుకుంటే ఆమెను పెట్టి గాడ్, సెక్స్, అండ్ ట్రూత్ పార్ట్ 2 సినిమా తీస్తానని వివాదాస్పదంగా మాట్లాడారు.
రోజా అనంతరం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఆరోపణలు గుప్పించారు కౌండిన్య. సినీ పరిశ్రమ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో చేస్తోంటే… సినిమాటోగ్రఫీ మాత్రం ఎలాంటి చలనం లేకుండా ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వానికి సినీ రంగం రూ. 600 కోట్ల ట్యాక్స్ కట్టిందని, కానీ కేసీఆర్ అనౌన్స్ చేసిన ఏ ఒక్క పనీ అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. ఈ సమస్యను తలసాని దృష్టికి తీసుకెళ్తే… యూసఫ్ గూడ చెక్ పోస్ట్ వద్ద ఉన్న చిన్న శ్రీశైలంయాదవ్ ను కలవమన్నారని, మినిష్టర్ గా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారా అని కౌండన్య ప్రశ్నించారు.
జనసేనానిపైనా కౌండిన్య తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నో సమస్యలపై ప్రశ్నించే పవన్… సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించరా..? అని నిలదీశారు. కేసీఆర్ కు క్షమాపణలు చెప్పుకోవడానికే… పవన్ ఆయన ఇంటికి వెళ్లారని ఆరోపించారు. సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన గాయత్రి గుప్తా పై కూడా కౌండిన్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో అమ్మాయిలను నిర్మాత, దర్శకులు వాడుకుంటారని ఆమె అంటున్నారని, సినీ పరిశ్రమలో జరిగేది ఏంటో తెలిసి కూడా ఇలాంటి విషయాలు మాట్లాడతావా..? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. గాయత్రి గుప్తా ఆడా, మగా తేడా తెలీని అమ్మాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.