ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన సీనియర్ దర్శకులు కోడి రామ కృష్ణ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య కారణంగా గచ్చిబౌలి లోని ఏఐజి హాస్పిటల్ లో చేర్చిన విషయం తెలిసిందే. వెంటిలేటర్ మీద చికిత్స అందించిన ఆయన ఆరోగ్యం కుదట పడలేదు. దీంతో ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 2019, ఫిబ్రవరి 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు కోడి రామకృష్ణ. సెంటిమెంట్ మూవీస్ తీయటంతో ఆయన స్పెషలిస్ట్. కాలంతో మారుతూ.. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలను తీయటంలో ప్రత్యేకత చాటుకున్నారు. సినిమాల్లో గ్రాఫిక్స్ ఉపయోగించటంలోనూ ఆద్యుడిగా కీర్తిని సంపాదించారు. ఆయన మొదటి సినిమా చిరంజీవి హీరోగా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. మొదటి సినిమాతోనే గోల్డెన్ జూబ్లీ హిట్ అందుకున్న ఆయన బాలకృష్ణకు ‘మంగమ్మ గారి మనవడు’తో సోలో హీరోగా మొదటి సక్సెస్ అందించిన ఘనత కూడా కోడి రామకృష్ణకే దక్కింది. ఆయన అందించిన భక్తి చిత్రాల్లో ‘అమ్మోరు’, ‘దేవి’, ‘దేవుళ్లు’, హార్రర్ చిత్రాలల్లో ‘అరుంధతి’ టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచాయి. ఆయన మృతికి టాలీవుడ్ దిగ్బ్రాంతికి లోనయ్యింది.