అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన గద్వాల జేజమ్మ !

తెలంగాణా కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారింది, గత ఎన్నికల సమయంలో కాస్త పుంజుకున్నట్టు కనిపించిన ఈ పార్టీ ఎన్నికల తర్వాత వెలువడిన ఫలితాలు అంచనాలు తారుమారు కావడంతో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. టీ-కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలు ఇప్పటికే ఆ పార్టీని వీడారు. మహబూబ్ నగర్ కు చెందిన సీనియర్ నేత డీకే అరుణ కూడా ఇదే బాట పట్టనున్నట్టు నిన్నటి నుండి వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఆమె ఖండించలేదు, ఈ నేపధ్యంలో నిన్న రాత్రి పొద్దుపోయాక ఆమె ఢిల్లీలో బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన ఆమె కాంగ్రెస్‌ను వీడడం ఆ పార్టీకి పెద్ద దెబ్బేనని చెబుతున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చొరవతో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన అరుణ టీఆర్ఎస్ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న అరుణ అనూహ్య నిర్ణయం తీసుకుని బీజేపీలో చేరడం సొంత పార్టీ నేతలను కలవర పరుస్తోంది. మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ చేయించాలని తొలుత టీ పీసీసీ భావించినా బరిలో నిల్చేందుకు ఆమె ఆసక్తి చూపించలేదు. అంత లోనే అరుణ పార్టీ మారడం టీ పీసీసీ పెద్దలకు పెద్ద షాక్ అనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డ కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తోంది. ఓ వైపు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నా బలమైన నేతలను ఎంపీ అభ్యర్థుగా బరిలోకి దించి సత్తాచాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో డీకే అరుణ దూరం కావడం ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. క్యాంపెయిన్ కమిటీ వైస్ ఛైర్మన్‌గా ఉన్న అరుణ పార్టీని వీడడం కాంగ్రెస్ పెద్దలను షాక్ లో ముంచేసింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆమె మహబూబ్‌నగర్ నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నట్టు సమాచారం.