కరుణానిధి తీవ్ర అనారోగ్యంతో జూలై 29న కావేరి ఆసుపత్రిలో చేరి ఐసీయూలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఆరోగ్యం తీవ్రంగా విశామించినట్టు తెలుస్తోంది. వృద్ధాప్యం కారణంగా ఆయన శరీరంలోని అంతర్గత అవయవాలు చికిత్సకు స్పందించే స్థితిలో లేనట్లు సమాచారం. కొద్ది నిముషాల క్రితం స్పెషల్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు ఈ విషయాన్ని స్పష్టం చేసారు. దీంతో ఆయన పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ డీఎంకే కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకుంటున్నారు. తొలుత నేటి రాత్రి 7.00 గంటలకు కరుణానిధికి చికిత్సనందిస్తున్న వైద్య బృందం హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉందని భావించినా సుమారు మూడు గంటల ముందే ఈ ప్రకటన రావడంతో ఆయన ఆరోగ్యం మీద అనుమానాలు మొదలయ్యాయి.
కరుణానిధి ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కావేరి ఆసుపత్రి బయట పోలీసులు భారీగా మొహరించారు. ఇదిలా ఉంటే కరుణానిధి కుమారుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసినట్లు మెరీనా బీచ్‌లో కరుణానిధి స్మారకం కోసం స్థలం కేటాయించాలని సీఎంను స్టాలిన్ కోరినట్లు తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోపక్క ఆసుపత్రి బయట ఉన్న ఆయన అభిమానులు రోదించడం మొదలుపెట్టారు. అసలు ఆసుపత్రిలో ఏమి జరుగుతుందో తెలియని పరిస్తి నెలకొంది.