Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ ఒక సుందరమైన ప్రదేశం. భౌగోళికంగా సుసంపన్నమైన ప్రాంతం. నదులు, అడవులు, కొండలు, చెరువులు, వాగులు, నల్ల, ఎర్రరేగడి భూములు, గనులు, ఖనిజాలతో విలసిల్లుతున్నది తెలంగాణా రాష్ట్రం. తూర్పున కందికల్ గుట్టల వరుస, పడమట బాలాఘాట్ పర్వతశ్రేణులు, ఉత్తరాన గోదావరీ నది, దక్షిణాన కృష్ణానది సహజ సరిహద్దులుగా నెలకొని ఉన్న రాష్ట్రము ఇది. గోదావరి నానుకొని దండకారణ్యం, కృష్ణనానుకొని నల్లమల అడవులు సహజ సంపద నిలయాలుగా ఉన్నాయి. నదులు, కొండలు, అడవులు అల్లుకొని ఉన్న ప్రదేశం కనుక వీటిని నమ్ముకొని ఎన్నో గిరిజన తెగలు జీవిస్తూ వచ్చాయి. కోయలు, గోండులు, చెంచులు, గుత్తికోయలు, కొండరెడ్లు, రాజ్‌గోండులు కోలాములు మొదలైన ఆదివాసులు తమ ప్రత్యేక విధానాలతో జీవనం సాగిస్తున్నారు. క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల నుంచి ఉనికిలో ఉన్న గోండులు ప్రాచీన ఉత్పత్తి కథను చెప్పుకుంటూ ‘ టేకం, మార్కం, పూసం, తెలింగం’ అనే నలుగురు మూలపురుషుల్ని దేవతలుగా పేర్కొంటారు.
ఇందులో ‘తెలింగం’ ప్రాచీన తెలుగు జాతి మూలపురుషుడని ఆరుద్ర భావించాడు. ఖండవల్లి లక్ష్మీపురం జనం స్థానికంగా ప్రాచీన కాలం నుంచి ‘తలైంగ్’ జాతివారు నివసించారని ‘తలైంగ్’లు నివసించినందు వల్ల ‘తిలింగ’ ‘తెలుంగు’ పదాలు వాడుకలోకి వచ్చాయని, వారు మాట్లాడే భాష ‘తెలుంగు’ అని, ఆ జాతి ‘తెలుంగు’ లని ఖండవల్లి సోదరులు భావించినారు.
బర్మాలో నివసిస్తున్న ఒక తెగ ఇప్పటికీ తాము ‘తలైంగ్’ జాతి వారమని చెప్పుకొంటారని పేర్కొన్నారు. మార్కండేయ, వాయు పురాణాల్లో ‘తిలింగ’ ప్రస్తావనవుంది. గ్రీకుశాస్త్రజ్ఞుడు టాలెమి తన యాత్రాచరిత్రలో ‘టిలింగాన్’ పదాన్ని పేర్కొన్నాడు. ఈ ‘తిలింగ’ శబ్దమే ‘తెలుంగు’ శబ్దానికి మూలం. ‘తెలుంగు’ ‘గణం’ కలిసి ‘తెలుంగణం’గా మారినట్లు భావించవచ్చు. మెదక్ జిల్లా తెల్లాపూర్‌లో బయట పడిన క్రీ॥శ॥ 1417 నాటి శాసనంలో ‘తెలుంగణ’ పదం, 1510 వెలిచర్ల శాసనంలో ‘తెంగాణ’ పదం ప్రయోగించబడింది. అనంతర కాలంలో, వ్యవహారాల్లో ‘తెలంగాణ’ పదం విస్తృత ప్రచారంలోకి వచ్చింది.