జాతీయ పతాకం ప్రతీ పౌరునికీ గర్వకారణం. దేశ జెండాను చూస్తే మనసంతా ఉత్తేజం నిండుతుంది. అలాంటి స్ఫూర్తిదాయకమైన మువ్వన్నెల జెండాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ ఎంతో గౌరవం ఇస్తారు. ఆ విషయం బ్రిక్స్ సదస్సు ఫొటో సెషన్‌లో మరోసారి రుజువైంది.
నేలపై జెండా పెట్టారని..
బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న నేతలు గ్రూప్ ఫొటో దిగేందుకు వేదికపైకి వచ్చారు. నేతలు ఫొటో కోసం నిలబడవలసిన ప్రదేశాన్ని సూచించేందుకు ఆయా దేశాల జాతీయ జెండాలను నేలపై పెట్టారు. మోదీ వేదికను ఎక్కుతూ ఆ విషయాన్ని గమనించారు. మన జాతీయ జెండాను జాగ్రత్తగా తీసుకుని తన కోటు జేబులో పెట్టుకున్నారు. కాలు మోపకుండా, వంగి, మన జాతీయ జెండాను తీసుకుని జేబులో పెట్టుకున్నారు. దీనిని గమనించిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా కూడా తన దేశపు జాతీయ జెండాను జాగ్రత్తగా తీసుకొని, మరొకరికి ఇచ్చారు.
ఎందుకలా పెట్టారు..
బ్రిక్స్ దేశాల జెండాలు ప్రదర్శించాలన్న ఉద్దేశంతో నిర్వాహకులు వేదికపై జాతీయ నేతలు ఫొటోలు దిగే సమయంలో ఆయా దేశాల జాతీయ జెండాలు ఏర్పాటు చేశారు. వేదిక చుట్టూ పెట్టినట్లుగానే నేలపై కూడా దక్షిణాఫ్రికా, భారత పతాకాలను ఏర్పాటు చేశారు. కానీ తల ఎత్తుకు చూడాల్సిన జాతీయ పతాకం తల దించుకొని ఉండటం మోదీకి నచ్చలేదు. దీంతో ఆయన నిర్వాహకులను ఏమీ అనలేదు. ఎక్కడా తప్పు పట్టలేదు. జాతీయ జెండాను తీసుకుని తన కోటు జేబులో పెట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు కూడా మోదీని అనుసరిచాడు. వెంటనే అక్కడకు వచ్చిన సిబ్బంది జెండాలు ఇవ్వమని అడుగగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఇచ్చాడు. మోదీ మాత్రం తన జేబులోనే ఉంచుకున్నారు.