10 వేల కోసం కుక్క కిడ్నాప్‌

dog-kidnapping-for-10-thousand

రూ.10 వేల కోసం కుక్కను కిడ్నాప్‌ చేసిన ఘటన ఏపీలో జరిగింది. అనంతపురం కదిరి మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా ఆసక్తి కలిగించింది. సోమేష్‌ నగర్‌కు చెందిన చంద్రమౌళిరెడ్డి ఓ గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకుడు. ఏడాది కిందట ఓ కుక్క పిల్లను తెచ్చి గోడౌన్‌ వద్ద వదిలిపెట్టాడు.

అక్కడ కాపలాగా ఉన్న వెంకటేశ్‌ భార్య భారతి దాని బాగోగులు చూసేది. గోడౌన్‌లోని గ్యాస్‌ సిలిండర్లకు ఆ కుక్క కాపలాగా ఉండేది. అయితే సోమవారం ఓ వ్యక్తి బైక్‌పై వేగంగా దూసుకొచ్చి కుక్కను పట్టుకెళ్లాడు. కుక్క కిడ్నాప్‌పై గోడౌన్‌ యజమాని కదిరి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గాండ్లపెంట మండలానికి చెందిన మల్లి అనే వ్యక్తి కుక్కను తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తే.. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి కాపలాకు ఓ కుక్కను తెచ్చిస్తే రూ.10 వేలు ఇస్తానన్నాడని, దీంతో దానిని పట్టుకెళ్లినట్టు మల్లి చెప్పాడు. పోలీసులు అతనికి కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలిపెట్టారు. కుక్కను భారతికి అప్పగించారు